దేశాన్ని కాపాడగల ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమే: టిఆర్ఎస్‌

October 30, 2021


img

ఏ రాజకీయ పార్టీకైనా తమ అభిప్రాయాలు, ఆలోచనలే ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలుగా చెప్పుకోవడం పరిపాటి. ఈవిషయంలో టిఆర్ఎస్‌ పార్టీ మరికాస్త ఎక్కువని చెప్పుకోక తప్పదు. ఆ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పిన మాటలే ఇందుకు మరో తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

శుక్రవారం నకిరేకల్‌లో టిఆర్ఎస్‌ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దానిలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతుంటే, కేంద్రప్రభుత్వం రైతుల నడ్డివిరిచేలా నల్ల చట్టాలను తీసుకువచ్చింది. మోడీ పాలన పట్ల దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ఇటువంటి కష్టకాలంలో కూడా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న సిఎం కేసీఆర్‌ వైపే యావత్ దేశ ప్రజలు చూస్తున్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారు. దేశాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమే,” అని అన్నారు.     

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆయన నాయకత్వాన్ని కోరుకోవడం సహజమే కానీ దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకొంటున్నారని టిఆర్ఎస్‌ నేతలకు ఎవరు చెప్పారో తెలీదు. దేశాన్ని ఆయన మాత్రమే కాపాడగలరని లింగయ్య చెప్పడం బహుశః సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌లను ప్రసన్నం చేసుకోవడానికి పలికిన మాటలే అని భావించవచ్చు. జాతీయ రాజకీయాల గురించి తెలిసినవారెవరూ ఈవిదంగా మాట్లాడరు. ఎందుకంటే, జాతీయ రాజకీయాలలో ఉత్తరాది పార్టీలు, రాష్ట్రాల నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇటువంటి అవకాశాలు వస్తుంటాయి. దక్షిణాదికి చెందిన కొందరు నేతలు ప్రధానులుగా చేసినప్పటికీ ఒక్క పీవీ నరసింహ రావు తప్ప మిగిలినవారు ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోవడం అందరికీ తెలుసు. నేటికీ జాతీయ స్థాయిలో ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

కనుక సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడం సాధ్యమే కానీ ప్రధానమంత్రి కావడం చాలా కష్టం. ఒకవేళ కేసీఆర్‌ ప్రధానమంత్రి అవ్వాలంటే ఆయన వెనక కనీసం 100-150 మంది ఎంపీలైన ఉండాలి. కానీ కేవలం 9 మందే ఉన్నారు. అదీగాక కాంగ్రెస్‌, బిజెపిలలో దేనితో ఒకదానితో అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతు ఇస్తాయనుకోలేము. అందుకే ఆయన థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించడంలేదని అందరికీ తెలుసు. 

అయితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి ఎలా అయ్యారనే సందేహం కలుగవచ్చు. ఆయన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జాతీయపార్టీ అయిన బిజెపిలో ఉన్నారు కనుకనే ఆయన సమర్ధతకు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపు, పదవి అన్నీ లభించాయి. పదేళ్ళ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయి మోడీని ప్రత్యామ్నాయంగా చూశారు కనుకనే ఆయనకు పట్టం కట్టారు. కనుక ఒకవేళ కేసీఆర్‌ ప్రధాన మంత్రి కావాలనుకొంటే ఏమి చేయాలో ఆయనే ఆలోచించుకోవాలి.  


Related Post