దళిత బంధుకు హైకోర్టు రెడ్ సిగ్నల్‌

October 28, 2021


img

హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం అమలుతో ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున దానిపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరుగబోతున్నందున ఈ సమయంలో ఈసీ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కనుక నవంబర్‌ 3 వరకు హుజూరాబాద్‌లో ఈ పధకం అమలుకాదని స్పష్టం అయ్యింది. 

టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక మహా సంచలనం. మరే పధకంపై ఇంతగా చర్చ జరగలేదు. అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సరిగ్గా హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కొద్ది రోజుల ముందు ఈ పధకం ప్రకటించడం ఒక కారణమైతే, అది ఆచరణ సాధ్యం కానీ పధకం కావడం మరో కారణమని చెప్పవచ్చు. 

ఈ పధకానికి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామని, హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది కాదని టిఆర్ఎస్‌ ఎంతగా వాదిస్తున్నప్పటికీ దాంతో అది ఉపఎన్నికలో లబ్ది పొందాలనుకొంటోందని బహిరంగ రహస్యం. హుజూరాబాద్‌లో ఈ పధకాన్ని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఈసీ నిషేదించినప్పటికీ, దానిని శాస్వితంగా నిషేదించినట్లు, అందుకు ప్రతిపక్షాలే కారణమని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుండటం గమనిస్తే ఈ పధకంతో టిఆర్ఎస్‌ రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందని అర్ధం అవుతుంది.

ఈ ఉపఎన్నికలోనే కాదు...2023లో జరుగబోయే శాసనసభ ఎన్నికలలోనూ దీంతో లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు వాదనలో నిజం లేకపోలేదు. అయితే రూ.3,016 నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల పంట రుణాలను మాఫీ చేయలేకపోతున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ పదేసి లక్షల చొప్పున ఏవిదంగా ఇవ్వగలదనే ప్రతిపక్షాల ప్రశ్న ప్రజలను కూడా ఆలోచింపజేస్తోంది. అందుకే ఈ పధకం ప్రకటన, అమలు విషయంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధిని అందరూ శంకిస్తున్నారని చెప్పవచ్చు. 


Related Post