రాష్ట్రాలలో విద్యుత్ కోతలు...కేంద్రం స్పందన

October 12, 2021


img

మళ్ళీ మొదలైన కరెంటు కష్టాల గురించి మాట్లాడుకొంటే అది ఏడు చేపల కధవుతుంది. ముందుగా ‘విద్యుత్ ఉత్పత్తి సంస్థలూ...మీరు ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదూ?’ అని అడిగితే ‘మాకు బొగ్గు గనులవాళ్ళు బొగ్గు ఇవ్వడం లేదు అందుకే...’ అంటున్నాయి. 

‘బొగ్గు గనులు...బొగ్గు గనులు...మీరు ఎందుకు బొగ్గు ఇవ్వడం లేదు?’ అంటే ‘ఈసారి భారీ వర్షాలకు బొగ్గు గనులు నీళ్ళతో నిండిపోయాయి అందుకే’ అంటున్నాయి. 

‘భారీ వర్షాలు ఎందుకు పడ్డాయని వాతావరణశాఖని అడిగితే ‘అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం’ అంటూ ఆకాశం కేసి చూపించి ఏవేవో చెపుతున్నారు. 

కనుక కనురెప్పపాటు కూడా విద్యుత్ పోదని గొప్పలు చెపుకొనే రాష్ట్రాలు సైతం ఈ ఏడు చేపల కధ చెప్పి విద్యుత్ కోతలు మొదలెట్టేశాయి. 

ఈవిషయంలో పొరుగున గల ‘సంక్షేమ రాష్ట్రం’ మిగిలిన అని రాష్ట్రాల కంటే ఒకడుగు ముందుంది. ‘ప్రజలు విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి...విద్యుత్ వినియోగం తగ్గించుకోండి...కోతలకు సిద్దంకండి...’ అంటూ ఓ మంత్రివర్యులు అప్పుడే ప్రజలకు ఉచిత సలహా, హెచ్చరికలు చేశారు. ఏపీలో రోజుకి ఓ పదిసార్లు విద్యుత్ పోవడం ఇప్పుడు సర్వసాధారణ విషయమైపోయింది. కొన్ని రాష్ట్రాలలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలైపోవడంతో జనాలు మళ్ళీ జనరేటర్లు, ఇన్వర్టర్లపై పడుతున్నారు. 

ఈ వర్షాలు-బొగ్గు-విద్యుత్-కధలు విని కేంద్రప్రభుత్వం స్పందిస్తూ రాష్ట్రాలకు కొన్ని ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చింది. అవేమిటంటే… 

• విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే. కనుక ప్రజలకు 24x7 విద్యుత్ సరఫరా చేసిన తరువాతే ఏమైనా విద్యుత్ మిగిలితే అమ్ముకోవాలి. ప్రజలకు విద్యుత్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను బ్లాక్‌లో అమ్ముకొన్నట్లు తెలిస్తే కటినచర్యలు తీసుకొంటాము.   

• కేంద్రం వద్ద రిజర్వ్ లో ఉంచిన 15 శాతం విద్యుత్‌ను అవసరమున్న రాష్ట్రాలు వినియోగించుకోవాలి. 

• మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఆ విద్యుత్ ఇవ్వాలి.

అయితే భారత్‌లో ఇటువంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు అందినకాడికి దోచుకొనేవారే కానీ ప్రజల కష్టాలను పట్టించుకొనేవారు లేరనే సంగతి అందరికీ తెలిసిన విషయం. కనుక మళ్ళీ బొగ్గు ఉత్పత్తి మొదలయ్యే వరకు ఈ విద్యుత్ కష్టాలు భరించక తప్పకపోవచ్చు. ఏపీ మంత్రిగారు కూడా ఇదే చెప్పారు కదా! 


Related Post