విద్యాబోధనలో ఇంత అయోమయం ఎందుకు?

July 22, 2021


img

మన విద్యావిధానంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ మెరుగుపరిచేందుకు కృషి చేస్తూనే ఉంటాయి. అయితే విద్యాబోధన, పరీక్షల విషయంలో నేటికీ అయోమయం నెలకొని ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాలలో పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీషు మాధ్యమంలో భోదన చేయడం చాలా అవసరమని గట్టిగా నమ్ముతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దులపై బలవంతంగా ఇంగ్లీషు మీడియం రుద్దాలని ప్రయత్నిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేసి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తేనే విద్యార్దులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని గట్టిగా వాదిస్తోంది. 

నిజమే..ఇప్పుడు ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడం, ఆ భాషపై పట్టు సాధించడం చాలా అవసరమే ఎవరూ కాదనలేరు. ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టిన ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు మూడు నాలుగు దశాబ్ధాల క్రితమే మద్యతరగతి ప్రజలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చేశాయి. 

ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇంగ్లీషులోనే విద్యాబోధన మంచిదని వాదిస్తున్నవారు ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలను మాతృభాషలో వ్రాసే అవకాశం కల్పించాలని ఎందుకు అడుగుతున్నట్లు? ఇటీవల మంత్రి కేటీఆర్‌ కూడా ఇదే విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ వ్రాశారు. విద్యార్దులందరికీ సమాన అవకాశం కల్పించడానికి మాతృభాషలో పరీక్షలు వ్రాసేందుకు అనుమతించాలని కోరారు. 

అంటే ప్రాధమిక స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయి వరకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన వలన ఆశించిన ఫలితం లభించడంలేదనుకోవాలి. విద్యార్దులు ఇంగ్లీషు బాషలో పోటీ పరీక్షలే వ్రాయలేకపోతే తరువాత వారు ఏవిదంగా ఉన్నతస్థాయి చదువులు చదువుకోగలరు?అనే మరో ప్రశ్న కూడా ఎదురవుతుంది. 

ఇది ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకే పరిమితమైన సమస్య కాదు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలలో ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్న విద్యార్దులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది ఇంగ్లీషు బాషపై కొంత పట్టు సాధించి గడగడా మాట్లాడగలుగుతున్నారు కానీ ఇంగ్లీషులో తప్పులు లేకుండా వ్రాయడం, అవలీలగా చదివి అర్ధం చేసుకోవడంలో తడబడుతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్న కారణంగా వారికి మాతృబాషకు దూరం అవుతున్నారు. మాతృభాష (తెలుగు)లో వ్రాయడం, చదవడం రానివారు...లేదా రాదని గొప్పగా చెప్పుకొనేవారు మన చుట్టూ చాలామందే ఉన్నారు. 

అంటే అటు మాతృబాషను పూర్తిగా నేర్పించకుండా ఇటు ఇంగ్లీషు బాషపై పట్టు సాధించలేకపోతే ఆ చదువులకు అర్ధం ఏముంటుంది? ఇంగ్లీషు, మాతృభాషలలో దేనిపై కూడా పూర్తి పట్టుసాధించలేనప్పుడు వారు జీవితంలో ఏవిదంగా రాణించగలరు?అసలు మాతృభాషకు దూరమైనవారు ఏ జాతికి చెందినవారవుతారు?అని ఆలోచిస్తే మన బాషా బోధనావిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధమవుతుంది. 

ఒక దశ, స్థాయి వరకు ఎంతటివారైనా సరే తమ మాతృబాషలోనే ఆలోచిస్తారు అర్ధం చేసుకొంటారనేది అందరికీ తెలిసిన నిజం. రష్యా, జపాన్, చైనా వంటి దేశాధినేతలు గర్వంగా తమ మాతృభాషలో మాట్లాడుతూ తమ మాతృభాషలను గౌరవిస్తుంటే వందలాది బాషలతో అలరారుతున్న భారత్‌కు ఈ భావదారిద్ర్యం, భాషా దారిద్ర్యం ఎందుకో?

కొన్ని దశాబ్ధాల క్రితం వరకు భారతీయులు ఇంగ్లీషు నేర్చుకోకపోయినా దేశవిదేశాలలో రాణించగలిగారు. కానీ ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకొంటున్నా పోటీ పరీక్షలు కూడా వ్రాయలేకపోవడం ఏమిటి?అసలు విద్యార్దులకు ఏ మాద్యమంలో  బోధన చేయాలనే విషయంలో ఇంత అయోమయం ఎందుకో?


Related Post