భారత్‌లో వ్యాక్సిన్‌ తిప్పలు తీరేదెప్పుడు?

May 10, 2021


img

భారత్‌లో కరోనా వాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటి గురించి ప్రజలలో చాలా అపోహలు, అనుమానాలు, భయాల కారణంగా చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ప్రాణాభయంతో అందరూ వాక్సిన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

దేశ జనాభాకు సరిపడినన్ని వాక్సిన్లు ఉత్పత్తి కాకపోతుండటంతో వాక్సినేషన్ ప్రక్రియ దాదాపు అన్నీ రాష్ట్రాలలో తరచూ నిలిచిపోతోంది. పైగా ప్రస్తుత వ్యాక్సిన్‌ విధానంతో పరిస్థితి మెరుగుపడకపోగా ప్రజలలో మరింత అయోమయం సృష్టిస్తోంది.

ప్రతీరోజూ వందల సంఖ్యలో ప్రజలు వాక్సిన్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో నిలబడుతుంటే వందమందికి మాత్రమే ఇస్తాం...లేదా సెకండ్ డోస్ మాత్రమే ఇస్తాం... అని చెపుతుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆగ్రహావేశాలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేవనుకోలేము. కానీ వాక్సిన్ ఉత్పత్తి తక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడూ మేము మాత్రం ఏం చేయగలమని తలలు పట్టుకొంటున్నాయి.

హైదరాబాద్‌, వరంగల్‌ వంటి పెద్ద నగరాలలో ఉన్నవారు వాక్సిన్ల కోసం కార్లు, బైకులు వేసుకొని ఇరుగుపొరుగు జిల్లాలకు వెళుతున్నారంటే పరిస్థితి ఏవిదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితులను చూసి 45 ఏళ్ళకు పైబడి మొదటి డోస్ వేసుకొన్నవారు ఇప్పుడు తమకు రెండో డోస్ లభిస్తుందా లేదా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగా తెలంగాణతో సహా ఇప్పుడు మొదట రెండో డోస్ టీకాఊ మాత్రమే వేస్తున్నారు. ఇది చూసి 45 ఏళ్ళకు పైబడి ఇంకా మొదటి డోస్ వేసుకోనివారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారితో పాటు 18-45 ఏళ్ళలోపువారు ముఖ్యంగా 25-45 ఏళ్ళలోపువారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వాక్సిన్ డిమాండ్ తట్టుకొనేందుకు కేంద్రప్రభుత్వం కోవీషీల్డ్, కోవాక్సిన్‌ల ఉత్పత్తి మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు మూడు నెలల తరువాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నుంచి స్పుత్నిక్-వి, అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్-డి వాక్సిన్లు కూడా అందుబాటులో రానున్నాయి. కనుక ఆగస్ట్ నాటికి దేశంలో కరోనా వాక్సిన్ కొరత కొంతవరకు తీరవచ్చు. అంతవరకు ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము కాపాడుకోక తప్పదు. 


Related Post