మెట్రో రైల్‌ సర్వీసులకు మార్గదర్శకాలు జారీ

September 03, 2020


img

ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలోగల మెట్రో రైల్  సర్వీసులను ప్రారంభించడానికి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. మెట్రో రైళ్ళ ద్వారా కరోనా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక కేంద్ర ఆరోగ్యశాఖ దానికి సంబందించి మార్గదర్శకాలను నిన్న జారీ చేసింది. ఆ వివరాలు: 

• మెట్రో రైల్‌ సర్వీసులను సెప్టెంబర్ 12 వరకు దశలవారీగా క్రమంగా పెంచాలి ఒకేసారో అన్ని సర్వీసులను ప్రారంభించకూడదు.  

• మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేవిధంగా మెట్రో రైళ్ళ ఫ్రీక్వెన్సీ నిర్ణయించుకోవాలి.  

• ప్రయాణికుల రద్దీని తగ్గించుకొనేందుకు అవసరమైతే కొన్ని స్టేషన్లలో ట్రెయిన్స్ ఆపకుండా నడిపించుకోవచ్చు.  

• కంటెయిన్మెంట్ జోన్స్ వద్ద గల మెట్రో స్టేషన్లలో రైళ్లు ఆపకూడదు. ఆ ప్రాంతంలో ఉండేవారెవరూ లోపలకు ప్రవేశించకుండా గేట్లన్నీ మూసివేయాలి. 

• మెట్రో స్టేషన్లలో, మెట్రో రైళ్ళ లోపల కూడా ప్రయాణికులు భౌతికదూరం పాటించేందుకుగాను ప్రత్యేక మార్కింగ్ చేయాలి.

• ప్రతీ మెట్రో స్టేషన్లో అందుబాటు ధరలో మాస్కూలు లభించేలా ఏర్పాటు చేయాలి. మాస్కు ధరించకుండా ఎవరినీ లోపలకు అనుమతించరాదు. 

• ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులైన ప్రయాణికులను మాత్రమే ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత మెట్రో స్టేషన్లలోకి అనుమతించాలి.

• ప్రతీ మెట్రో స్టేషన్ ప్రవేశద్వారాల వద్దనే ప్రయాణికుల కోసం శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.    

• మెట్రో స్టేషన్ లోపల ప్రయాణికులు తిరిగే ప్రదేశాలలో, సిబ్బంది పనిచేసే ప్రదేశాలలో, అలాగే మెట్రో రైళ్ళ లోపల కూడా తరచూ శానిటైజేషన్ చేస్తుండాలి. 

• టోకెన్స్, టికెట్స్ జారీ చేసేటప్పుడు వాటిద్వారా కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులు అందరూ స్మార్ట్ కార్డ్స్ వినియోగించి ప్రయాణాలు చేసేందుకు ప్రోత్సహించాలి.   

• ప్రతీ స్టేషన్లో ట్రెయిన్ ఆగినప్పుడు ప్రయాణికులు తోపులాటలు లేకుండా భౌతికదూరం పాటిస్తూ ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా తగినంత సమయం ఆపాలి.   

• ప్రయాణికులు వీలైనంత తక్కువ లాగేజీతో ప్రయాణించాలి. సులువుగా స్కానింగ్ చేసేందుకుగాను ప్రయాణికులు లోహపు (మెటాలిక్) వస్తువులను తీసుకురాకూడదు.     

• కరోనా నేపధ్యంలో మెట్రో స్టేషన్లలో, మెట్రో రైళ్లలో ఏసీ, ఫ్యానులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే వినియోగించాలి.

• మెట్రో రైళ్లలో కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలను పోస్టర్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా వివరిస్తుండాలి. 

• ప్రతీ మెట్రో స్టేషన్లో ఓ ప్రత్యేక అధికారిని నియమించుకోవాలి. అతను లేదా ఆమె స్థానిక ట్రాఫిక్ పోలీసులతో సంప్రదిస్తూ మెట్రో స్టేషన్ల బయట రద్దీ పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మెట్రో స్టేషన్ లేదా మెట్రో రైల్లో కరోనా రోగులను గుర్తించినట్లయితే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడానికి, సదరు ప్రయాణికుడికి సన్నిహితంగా ఉన్న మిగిలిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించడానికి వీలుగా స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు లేదా సిబ్బందితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.  

• ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలి. 


Related Post