ఏపీలో కరోనా...అయినా రాజకీయాలు మామూలే

April 18, 2020


img

కరోనా వైరస్ ఓ పక్క భూతంలా ప్రజల వెంటబడి తరుముతున్నా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల రాజకీయాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. 

జగన్ ప్రభుత్వానికి కరోనా మహమ్మారి బారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఆలోచన కంటే ఏదోవిధంగా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలనే తాపత్రయమే ఎక్కువైపోయిందని అందుకే రాష్ట్రంలో కరోనా కేసులను తక్కువ చేసి చూపుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా లేదని అటు కేంద్రప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను నమ్మించాలని విశ్వప్రయత్నాలు చేస్తోందని టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. 

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ అయినప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని కరోనా కేసులు, మృతుల సంఖ్యను కేంద్రానికి తెలియజేస్తే, సీఎం జగన్ మాత్రం మండలాలను యూనిట్లుగా తీసుకొని రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

అంతేకాదు...రెడ్‌ జోన్‌గా ప్రకటించిన విశాఖలో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికల కోసం ఆరాటపడుతున్న జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. తక్షణం కరోనా అసలు లెక్కలను ప్రకటించి, అందుకు తగ్గట్లుగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు హితవు పలికారు.    

బాబు విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “కరోనాను దాచి పెడితే దాగుతుందా? విశాఖలో అధికారులు ఎంతో సమర్ధంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసి చూపిస్తే వారిని అభినందించకపోగా, కరోనా కేసులు ఎందుకు పెరగడం లేదని చంద్రబాబునాయుడు నిలదీస్తుండటం చాలా శోచనీయం. మహారాష్ట్రాలో లాగా ఏపీలో కూడా కరోనా వైరస్‌ వ్యాపించి మనుషులు చనిపోవాలని చంద్రబాబునాయుడు కోరుకొంటున్నట్లున్నారు. అందుకే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని బాధపడిపోతున్నారు. ఆయన...కొడుకు లోకేశ్ ఇద్దరూ హైదరాబాద్‌లో కూర్చొని కరోనా రాజకీయాలు చేస్తున్నారు. వారికి రాష్ట్రం కరోనా నుంచి విముక్తి పొందాలనే ఆలోచన కంటే విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకోవాలనే తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే తండ్రీకొడుకులు ఇద్దరూ హైదరాబాద్‌లో కూర్చొని విశాఖవాసుల మనోధైర్యం దెబ్బతీసేందుకు ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ప్రజలే మళ్ళీ బుద్ది చెపుతారు,” అని అన్నారు.


Related Post