కవితకు బెయిల్‌ కోర్టులోనా... రాజకీయంగానా?

May 21, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలోని తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ రెండు నెలల్లో ఆమె ఎంతగా ప్రయత్నించినప్పటికీ బెయిల్‌ లభించలేదు.

సోమవారంతో ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ ముగియడంతో మళ్ళీ ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 

ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున ఆమె కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని ఆమె తరపున్ న్యాయవాది నితీశ్ రాణా వాదించగా, ఛార్జ్ షీట్ దాఖలు చేసినంత మాత్రన్న జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించకూడదనే నిబందన ఎక్కడా లేదని ఈడీ తరపు న్యాయవాది జోయెబ్ హుస్సేన్ వాదించారు. 

ఈ కేసులో హవాలా ద్వారా రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నేతలు ప్రిన్స్ కుమార్‌ అనే వ్యక్తిద్వారా ఏవిదంగా బదిలీ చేశారో, అందుకు ప్రతిగా ఆయనకు హవాలా ఆపరేటర్ ఆర్‌.క్రాంతి కుమార్‌ ద్వా రూ.16 లక్షలు అందాయని ఈడీ తరపు న్యాయవాది చెప్పారు. ఛార్జ్ షీట్‌లో కల్వకుంట్ల కవితతో సహా వీరందరూ ఈ ఆర్ధిక నేరంలో భాగస్వాములే అని నిరూపించే సాక్ష్యాధారాలను పేర్కొన్నామని తెలిపారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ జూన్ 3వరకు పొడిగిస్తున్నట్లు కావేరీ బవేజా తీర్పు చెప్పారు. 

ఈ కేసులో ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి, ఆయనతో సహా పలువురు జైలుకి వెళ్ళి వచ్చారు కూడా. ఢిల్లీలో తమ ఆమాద్మీ పార్టీని ఓడించలేకనే, మోడీ ప్రభుత్వం ఈవిదంగా తమపై ఈ అక్రమ కేసులు బనాయించి తమ ప్రభుత్వాన్ని అస్తిరపరిచి పడగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తోందని అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా మంత్రులు, ఆమాద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. 

కేసీఆర్‌ కూడా మోడీ ప్రభుత్వం తమని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఈ కల్పిత కేసును సృష్టించింది తప్ప ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరుగలేదని వాదిస్తున్నారు. 

కనుక కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించక పోవడం, జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగిస్తుండటం న్యాయ ప్రక్రియలో భాగంగానే కనిపిస్తున్నప్పటికీ, బహుశః రాజకీయ కారణాలు కూడా ఉండి ఉంటే ఉండవచ్చనిపిస్తోంది. 

ఇప్పుడు ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ జూన్3వరకు అంటే ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు రోజు వరకు పొడిగించడం కూడా ఇదే అనుమానం కలుగజేస్తోంది.

ఒకవేళ ఆమె రిమాండ్‌ పొడిగింపు వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లయితే జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె బెయిల్‌ విషయం తాడోపేడో తేలిపోవచ్చు.


Related Post