విలేఖరి ప్రశ్నకు రేవంత్ రెడ్డి చక్కటి సమాధానం

May 21, 2024


img

లోక్‌సభ ఎన్నికలకు ముందు రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ వంటి వివిద పార్టీల నేతలు టీవీ స్టూడియోల ఇంటర్వ్యూలలో పాల్గొని రాష్ట్ర, దేశ రాజకీయాలతో సహా వివిద అంశాలు, సమస్యలపై తమ అభిప్రాయాలను చెప్పారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ఎన్టీవీ నిర్వహించిన ‘క్వశ్చన్ హవర్’ కార్యక్రమంలో పాల్గొని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

“మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోవడం, ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం గురించి తప్ప తెలంగాణ కోసం ఏం చేశారు?” అని ఓ విలేఖరి ప్రశ్నించారు.

దానికి సమాధానంగా, “అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ పధకం ద్వారా రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాము. రైతు భరోసా కింద రూ.7,500 కోట్లు రైతుల ఖాతాలలో జమా చేశాము. నిరుద్యోగ యువతకు 30 వేల ఉద్యోగాలు (నియామక పత్రాలు) ఇచ్చాము.... అంటూ గడగడా సమాధానాలు చెప్పారు.

చివరిగా “రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించి మీరందరూ ధైర్యంగా ఓ ముఖ్యమంత్రిని ఇలా నిలదీసి ప్రశ్నించగల స్వేచ్చ కల్పించాము. మా ప్రభుత్వం గురించి మీరు ఏమి వ్రాస్తున్నా, మా ప్రభుత్వ పనితీరుని గమనించి చెప్తారనే ఆశతో ఎదురుచూస్తున్నాను,” అంటూ రేవంత్ రెడ్డి ముగించారు. 

నిజమే కదా? గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలేఖరులు ఎవరూ ఇంత ధైర్యంగా ప్రశ్నలు అడగలేకపోయేవారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి అడిగితే, “నువ్వు ఫలానా న్యూస్ ఛానల్‌ వాడివి కదా సప్పుడు సేయకుండా కూర్చో… అంటూ గద్దించేవారు. కనుక రేవంత్‌ రెడ్డి పాలనలో మీడియాకు మళ్ళీ పత్రికా స్వేచ్ఛ లభించిందనే చెప్పాలి. 


Related Post