ఈ నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అవి రెండు తెలుగు రాష్ట్రాలలో వ్యాపించేందుకు సుమారు వారం రోజులు సమయం పడుతుంది. కనుక జూన్ 5 నుంచి 11లోగా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత ఏడాది జూన్ 20 తర్వాత తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. కానీ ఈసారి మొదటి 10 రోజులలోనే వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈసారి సాధారణ స్థాయిలోనే వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాకాలంలో ఎగువన మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన నీటివనరు. ఎగువ నుంచి వచ్చిన నీటిని మేడిగడ్డ బ్యారేజిలో నిలువచేసి, అక్కడి నుంచి మిగిలిన జలాశయాలలోకి ఎత్తిపోసి నింపి ఉంచుకుని వర్షాకాలం ముగిసిన తర్వాత అవసరాన్ని బట్టి విడుదల చేస్తుంటారని అందరికీ తెలుసు.
కానీ గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజిలో 7వ బ్లాకులోని మూడు పియర్స్ క్రుంగిపోతే ఇప్పటి వరకు వాటికి మరమత్తులు చేయనే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ మేడిగడ్డ బ్యారేజిపైనే ఆధారపడి ఉంటుందని అందరి కంటే మాజీ సిఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. కానీ అప్పుడు మేడిగడ్డ బ్యారేజిలో పియర్స్ క్రుంగిన విషయం బయటపడితే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నష్టపోతుందని దానికి మరమత్తులు చేయకుండా ఆ విషయాన్ని దాచి పెట్టారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేడిగడ్డ బ్యారేజిలో ఏర్పడిన ఈ లోపాన్ని చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిందే తప్ప క్రుంగిన పిల్లర్లకు మరమత్తులు చేయించలేదు. కనీసం వర్షాకాలంలో బ్యారేజిని వాడుకోవడానికి వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయలేదు.
మరో 10-15 రోజులలో నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించబోతుంటే ఇప్పుడు హడావుడిగా తాత్కాలిక మరమత్తు పనులు మొదలుపెట్టబోతోంది. కానీ అవి ఎట్టి పరిస్థితులలో పూర్తయ్యే అవకాశం లేదు.
ఒకవేళ ఎగువ నుంచి భారీగా వరద నీరు మేడిగడ్డ బ్యారేజిలోకి వస్తే దెబ్బ తిన్న మూడు పియర్స్ వలన మిగిలినవి కూడా దెబ్బ తినకుండా కాపాడాలంటే బ్యారేజీలో నీటిని నిలువచేయకుండా దిగువకు విడిచిపెడుతుండాలని నిపుణులు చెపుతున్నారు.
ఇంకా అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ గోడలకు భారీగా పగుళ్ళు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా ఈ పదిరోజులలో పూర్తి చేయడం అసంభవమే. కనుక కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల రాజకీయాలకు మరోసారి రాష్ట్రంలోని రైతులు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.