రాష్ట్రంలో రాజకీయ స్తబ్దత

February 08, 2020


img

మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. ఆ తరువాత మేయర్లు, మునిసిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా ముగియడంతో రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ‘సైలెంట్ మోడ్’ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలకు ముందు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనతో హడావుడి చేసిన మజ్లీస్ పార్టీ కూడా ఇప్పుడు చల్లబడినట్లే ఉంది. 

టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారిక, పాలనాపరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బిజెపిలు తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించాయి. కనుక ప్రస్తుతం రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. 

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో 10 లక్షలమందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని సిఎం కేసీఆర్‌ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఆయన జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించేందుకు అది మార్గం చూపిస్తున్నప్పటికీ చేజేతులా సీఏఏ ఆందోళనలకు మళ్ళీ ఊపిరిపోసినట్లవుతుంది. దాంతో రాష్ట్రంలో నెలకొన్న ఈ ప్రశాంత వాతావరణానికి భంగం కలుగవచ్చు. కనుక సీఏఏపై సిఎం కేసీఆర్‌ ఇప్పుడే ముందుకు కదులుతారా లేక మరికొంతకాలం వేచి చూస్తారో? ఒకవేళ కేసీఆర్‌ ఆ దిశలో అడుగు ముందుకు వేయాలనుకొంటే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. అదేకనుక జరిగితే రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ హడావుడి మొదలవవచ్చు. 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు ఎంతగట్టిగా కృషి చేసినప్పటికీ దాదాపు అన్ని మునిసిపాలిటీలను, కార్పొరేషన్లను టిఆర్ఎస్‌ ఎగురేసుకువెళ్ళిపోవడంతో ఏమి చేయాలో, టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. 

ఇక మునిసిపల్ ఎన్నికలలో అభ్యర్ధులను నిలబెట్టలేక...నిలబెట్టినవారిని గెలిపించుకోలేకపోయిన బిజెపి కూడా ఏమీ చేయాలో పాలుపోక ప్రస్తుతం నిశబ్ధంగా ఉండిపోయింది. అలాగే రాష్ట్రంలో క్రమంగా ఉనికి కోల్పోతున్న వామపక్షాలు కూడా ప్రస్తుతం ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్లిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు చల్లబడటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా చల్లబడిపోయింది. అయితే రాష్ట్రంలో ఈ రాజకీయ ప్రశాంత వాతావరణం ఎంతకాలం ఉంటుందో? 


Related Post