మాధవీలతపై పోలీస్ కేసు నమోదు

May 14, 2024


img

హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హమాలీ బస్తీ పరిధిలోని హోలీ మదర్ హైస్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం 64లో నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆమె క్యూలో నుంచున్న ఓ ముస్లిం మహిళ వద్దకు వెళ్ళి, ఆమె ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు అడిగి తీసుకొని ఆమె వివరాలు అడిగారు. తర్వాత ఆమె మొహంపై బురఖా తొలగింపజేసి, ఆధార్ కార్డులోని ఫోటోతో పోల్చి తేడా ఉన్నట్లు గురించారు. 

వెంటనే పోలింగ్‌ అధికారులను పిలిచి ఆమెకు అక్కడ ఓటు ఉందా లేదా? ఫోటోలో ఉన్నదీ ఆమేనా కాదా తెలుసుకోకుండా ఓట్లు వేసేందుకు ఎలా అనుమతిస్తున్నారని పోలింగ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఆ మహిళా ఓటరుని అక్కడి నుంచి పంపించేసి ఆమె కూడా వెళ్ళిపోయారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశం మేరకు బీఎల్వో అరుణ మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు.


Related Post