మోడీ ఉన్నాలేకపోయినా దేశం నడుస్తుంది: కేటీఆర్‌

May 14, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, తాజా ఇంటర్వ్యూలో బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోందని ఆరోపించారు. “ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే ఈ దేశాన్ని కాపాడగలరు. ఆయన ఒక్కరే మేధావి. దేశం పట్ల నిబద్దత గలవారని నిరూపించేందుకే బీజేపీ పదేపదే రాహుల్ గాంధీని ఆయనతో పోల్చి చూపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 

మోడీతో రాహుల్ గాంధీ ఏవిదంగాను సరితూగలేరు కనుక దేశ ప్రజలు తనను ఎన్నుకోవడం తప్ప మరో దారి లేదన్నట్లు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. అయితే దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ మాత్రమే ఉన్నారా? కాదు కదా?” అని అన్నారు. 

అయితే మోడీని, బీజేపీని ఎదుర్కోగల వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారు? పేరు చెప్పమని సదరు టీవీ ప్రతినిధి స్మిత గుచ్చి గుచ్చి అడిగినా కేటీఆర్‌ ఎవరి పేరు చెప్పకుండా ‘రాజ్యాంగం’ అని అన్నారు. 

“2004 ఎన్నికలప్పుడు అటల్ బిహారీ వాజిపేయి లేకపోతే మరెవరూ?” అని ప్రశ్న వినిపించింది. ఆపుడు ఆయన స్థానంలో దేశ ప్రజలు మరొకరిని ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మోడీ లేకపోతే ఈ దేశాన్ని కాపాడటానికి ఎవరూ లేరన్నట్లు బీజేపీ వితండవాదం చేస్తోంది. 

కానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఆయన కంటే సమర్దుడు మరొకరు ఆ పదవి చేపడతారు. నిజానికి దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ ఉనికే లేదు. కనుక బీజేపీ, మోడీ లేకపోతే దేశం నడుస్తుంది? అని అనుకోవడం సరికాదు. 

ఒక వ్యక్తిని గద్దె దించడం కోసమే ఎన్నికలు జరగడం లేదా ఓ వ్యక్తి కేంద్రంగా ఎన్నికలు జరుగుతుండటం రెండూ సరికాదు. భారత్‌ ఓ ప్రజాస్వామ్య దేశం. కనుక పాలన, సమర్దత, అజెండా వంటి అంశాల ఆధారంగా ఎన్నికలు జరగాలి తప్ప మోడీ కోసమో లేదా మోడీ లేకపోతే ఎలా అనో ఎన్నికలు జరుగుతుండటం సరికాదు. నిజానికి ఇది బీజేపీ సృష్టించిన హైప్. కానీ ఈసారి బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటామని చెప్పుకోవడం వారి ఆందోళనకు అద్దం పడుతోంది,” అని కేటీఆర్‌ అన్నారు.  


Related Post