ఓటమికి జగన్‌ సిద్ధం కానీ కేసీఆర్‌ మాత్రం...

May 14, 2024


img

తెలంగాణలో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 3-4 సీట్లు మించి రావని సర్వేలు, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ చెపుతున్నారు. కానీ తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 12కి పైగా గెలుచుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ చెపుతున్నారు.

శాసనసభ ఎన్నికలలో కూడా కేసీఆర్‌ ఓడిపోతున్నామని మూడు నెలల ముందే తెలిసి ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు పోరాడారు. ఇప్పుడు అలాగే పోరాడుతున్నారు. 

అయితే ఏపీ సిఎం జగన్‌ ఇంతకాలం 175కి 175 సీట్లు మేమే గెలుచుకోబోతున్నామని ప్రగల్భాలు పలికి, పోలింగ్‌కు  నాలుగైదు రోజుల ముందు “ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లిపోతోందని” చెప్పడం ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించడంగానే అందరూ భావించారు.

పోలింగ్‌ ముగియగానే భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి, సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకొన్న వార్త కూడా జగన్‌ అస్త్ర సన్యాసం చేసి పారిపోతున్నట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపింది.

ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, ఏపీలో జగన్‌, వైసీపి నేతలు అప్పుడే మానసికంగా ఓటమికి సిద్దం అయిపోతున్నారు. వారికి వారి మీద నమ్మకం లేకపోయినా, వారు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తారని కేసీఆర్‌ గట్టిగా నమ్ముతున్నారు. అదే విషయం  చెప్పి ఆంధ్రా ఓటర్లను వైసీపికి అనుకూలంగా ప్రభావితం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుండటం విశేషం.


Related Post