లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయని కేసీఆర్ పదేపదే చెపుతున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉందన్నట్లు మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయలేకపోతోంది. ఇలాగే సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షోభం తప్పదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కట్టప్పలు ఆగస్ట్ నెలలో తిరుగుబాటు చేసే అవకాశం ఉంది,” అని లక్ష్మణ్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ రెండూ కూడా 10-12 సీట్లు గెలుచుకోగలమని నమ్మకంగా ఉన్నాయి. ఒకవేళ రెంటిలో ఏ పార్టీ 10-12 గెలుచుకోగలిగినా అవి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కట్టప్పలని ప్రోత్సహించి కూల్చివేసేందుకు ప్రయత్నించవచ్చు.
ప్రభుత్వంలో కట్టప్పల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించకపోయినా తన ప్రభుత్వాన్ని కూలద్రోయాలని బీజేపీ, కేసీఆర్ కాసుకుకూర్చున్నారని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పుకున్నారు కూడా. కనుక జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో గేమ్ చేంజర్ మొదలయ్యే సూచనలు ఉన్నట్లు భావించవచ్చు.
కానీ అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చేసేందుకు ఎవరు ప్రయత్నించినా అది చాలా హేయమైన చర్యే.