సోమవారం తెలంగాణతో పాటు ఏపీలో కూడా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విదంగా దేశవిదేశాలలో స్థిరపడినవారు కూడా ఏపీకి వచ్చి నిన్న ఓట్లు వేశారు.
హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలందరూ ఏపీలో ఓట్లు వేసేందుకు వెళ్లిపోవడంతో నగరం దాదాపు ఖాళీ అయిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏపీలో 68.04 శాతం పోలింగ్ నమోదైంది.
చాలా ప్రాంతాలలో అర్దరాత్రి వరకు ప్రజలు క్యూలో నిలబడి ఓట్లు వేశారు. దీంతో ఈసారి 80 శాతం కంటే ఎక్కువే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.
పెరిగిన ఈ పోలింగ్ శాతం కూటమి విజయాన్ని సూచిస్తుండగా, ఏపీలో నిన్న జరిగిన అల్లర్లు, దాడులు వైసీపిలో ఓటమి భయాన్ని సూచిస్తున్నట్లు భావించవచ్చు.
అయితే పెరిగిన పోలింగ్ శాతం తమ ఫ్యాను గాలి ప్రభంజనమే అని వైసీపి చెప్పుకుంటోంది. కానీ ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ అంచనాల ప్రకారం ఈసారి వైసీపి ఘోరపరాజయం పొందబోతోంది.
ఇంతకాలం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లే మేమే గెలుచుకుంటామని చెప్పుకున్నారు. కానీ ఈసారి టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి 115-120 సీట్లు, వైసీపికి 51 కంటే తక్కువ సీట్లు రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.
సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించవచ్చని జగన్ అనుకున్నారు. కానీ అమరావతి నిర్మాణం, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వంటి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు.
పైగా ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రమంతటా వ్యాపింపజేయడంతో ఆంధ్ర ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే ఇంకా నష్టపోతామని భావించిన్నట్లున్నారు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా తరలివచ్చి మరీ ఓట్లు వేశారని చెప్పవచ్చు.