దేశానికి ప్రధానే కానీ అక్కడ అభ్యర్ధి మాత్రమే!

May 14, 2024


img

సాధారణంగా ఓ కార్పొరేటర్ వస్తేనే అందరూ లేచి నిలబడి గౌరవం ప్రకటిస్తుంటారు. కానీ ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ఎదురుగా నిలబడినా ఆయన మాత్రం లేచి నిలబడరు. ఆయన దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండగా ప్రధాని నరేంద్రమోడీ ఆయన ముందు నిలబడాల్సిందే. ఇంతకీ ఎవరా వ్యక్తి? అంటే వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్‌. రాజాలింగం.

ప్రధాని నరేంద్రమోడీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న రాజాలింగం ఎదురుగా నిలబడి ఎన్నికల నియామావళికి కట్టుబడి ఉంటానని తెలియజేసే ప్రమాణపత్రం చదివి సంతకం చేసి ఇచ్చారు. 

ప్రధాని పదవితో పోలిస్తే జిల్లా మేజిస్ట్రేట్ చాలా చిన్న పదవి. కానీ అక్కడ మేజిస్ట్రేట్ ఎన్నికల అధికారి కనుక ఆయన    కుర్చీలో కూర్చుంటారు. ప్రధాని నరేంద్రమోడీ అక్కడ ఓ బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కనుక ఎన్నికల నియమావళి ప్రకారం ఆయన ఎదుట నిలబడి ప్రమాణపత్రం చదివాల్సిందే. ఇటువంటి సందర్భంలోనే మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఇంత బలమైనవా?అని అనిపించక మానవు.

ప్రధాని నరేంద్రమోడీ వారణాసి నుంచే పోటీ చేయడం ఇది మూడోసారి. మొదటిసారి వారణాసితో పాటు తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదరా నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. రెండోసారి వారణాసి నుంచి మాత్రమే పోటీ చేసినప్పుడు ఆరు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. 

ఈరోజు నామినేషన్స్‌ వేసే ముందు ప్రధాని నరేంద్రమోడీ కాలభైరవ స్వామి ఆలయంలో, గంగాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేలాదిమంది ఊరేగింపుగా భారీ ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం  చేరుకొని నామినేషన్స్‌ దాఖలు చేశారు.  

ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.       Related Post