అమరావతి మూడు ముక్కలు

January 20, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చివరికి అనుకొన్నదే చేస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఈరోజు ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడింది. సమావేశం ముగిసిన వెంటనే ఈ ప్రతిపాదనకు అసెంబ్లీ చేత కూడా ఆమోదముద్ర వేయించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది కనుక మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలుపడం లాంఛనప్రాయమేనాని చెప్పవచ్చు. అమరావతిని శాసనరాజధానిగా, విశాఖను పాలన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేయాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానికే నేడు శాసనసభ ఆమోదముద్ర వేయనుంది. పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే సాగుతుంది కనుక అమరావతి, కర్నూలు పేరుకే రాజధానులుగా ఉంటాయని చెప్పక తప్పదు. కనుక అమరావతి మూడు ముక్కలు కావడం తధ్యం. 

ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలపై ఈ మద్యకాలంలో కమిటీలు...నివేదికలు...చర్చలు...ఆమోదముద్రల తతంగం జరుగుతున్నప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విశాఖకు రాజధాని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు తెరవెనుక మొదలైపోయాయి. విశాఖలోని ఋషికొండ వద్దగల ఐటీ-హబ్‌లో గతంలో ఐ‌టి కంపెనీలకు కేటాయించిన మిలీనియం టవర్స్, సన్ రైజ్ టవర్స్‌లో ఏపీ సచివాలయం ఏర్పాటు చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

కనుక మూడు రాజధానుల ప్రతిపాదనలకు నేడు శాసనసభ ఆమోదముద్ర వేయగానే అధికారికంగా తరలింపు ప్రక్రియ ప్రారంభం అయిపోతుంది.  ముందుగా సచివాలయంలోని ఎంపికచేసిన ముఖ్య శాఖల కార్యాలయాలను విశాఖకు తరలించబోతున్నట్లు సమాచారం. ఉగాది (మార్చి 25) లోగా ఈ తరలింపు ప్రక్రియను పూర్తిచేసి, మే నెలాఖరుకల్లా విశాఖనుంచి పాలన ప్రారంభించాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Related Post