మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని ఆక్షేపిస్తూ ‘తోలు తీస్తా’నంటూ హెచ్చరించడంపై కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. మంత్రి సీతక్క స్పందిస్తూ, “అధికారం కోల్పోవడంతో కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎప్పటికీ నేనే అధికారంలో ఉండాలని అయన అనుకుంటే ఎన్నికలలో ఓడిపోతే మేమేదో అయన ఆస్తి గుంజుకున్నట్లు ఫీల్ అయిపోతున్నారు.
ప్రజలు ఆయనకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. కనుక ప్రజలు ఆయన పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అందుకే ఆయనకి మా పార్టీ, ప్రభుత్వంపై ఇంత అక్కసు. ఇంత కడుపు మంట. ఈ అక్కసుతోనే అయన రెండేళ్ళుగా ఫామ్‌హౌసులో ఉండిపోయారు. ఇప్పుడైనా దేని కోసం బయటకు వచ్చారంటే ఇంట్లో, పార్టీలో గొడవలు పెరిగిపోవడం వల్లనే. ఇంట్లో వాళ్ళని ఏమనలేక మా ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. తోలు తీస్తామంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోము,” మంత్రి సీతక్క ఘాటుగా బదులిచ్చారు.