పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఒకరు. స్పీకర్ లేఖపై స్పందిస్తూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ప్రతీ నెల తన జీతంలో నుంచి రూ.5,000 బీఆర్ఎస్ పార్టీ సభాపక్ష ఖర్చుల కోసం కట్ చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు. కనుక అనర్హత వేటు తనకి వర్తించదని ఆ లేఖలో పేర్కొన్నారు.
దీనిపై జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్పందన అద్భుతంగా ఉంది. ఆయన ఎలాగూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు కనుక ‘బీఆర్ఎస్ పార్టీలోకి సుస్వాగతం’ అంటూ ఓ పక్క అయన, మరోపక్క మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు వేసి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పెట్టారు.
కడియం శ్రీహరి సాంకేతిక కారణం చూపి అనర్హత వేటు పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన చెప్పిన మాటనే ఈవిధంగా ఆయుధంగా మార్చి ఆయనపై ప్రయోగించారు. ఈ ఫ్లెక్సీ బ్యానర్లను కడియం శ్రీహరి అవుననలేరు... కాదనలేరు కదా?