కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్‌ సమావేశం

December 20, 2025


img

మాజీ సిఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ దాదాపు రెండేళ్ళుగా ఫామ్‌హౌసులోనే కాలక్షేపం చేస్తున్నారు. అక్కడి నుంచే కేటీఆర్‌, హరీష్ రావుల చేత పార్టీ నడిపిస్తున్నారు. పంచాయితీ ఎన్నికలలో పార్టీ కాస్త పుంజుకున్నప్పటికీ మొత్తంగా చూస్తే పార్టీ పరిస్థితి అంత గొప్పగా లేదు.

కనుక మళ్ళీ తానే రంగంలో దిగి పార్టీని చక్కదిద్దుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఉన్నారు. కనుక నిన్న (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలనుకున్నారు.

కానీ పార్టీ నేతలందరికీ సమాచారం అందడంలో ఆలస్యం అవడంతో రేపు (ఆదివారం) సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలతో కార్యాచరణ రూపొందించి పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. 

రేపటి సమావేశంలో కేసీఆర్‌ తప్పకుండా సిఎం రేవంత్ రెడ్డిపై, ఆయన పాలనపై విమర్శలు గుప్పించడం ఖాయం. దానికి సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా అంతే ఘాటుగా బదులివ్వక మానరు. కనుక రాష్ట్రంలో రాజకీయ వేడి మళ్ళీ పెరుగుతుంది.

ఈ సమావేశంలో కేసీఆర్‌ బీజేపి-కేంద్ర ప్రభుత్వం-ప్రధాని మోడీపై ఏమైనా విమర్శలు చేస్తారా లేక వారి విషయంలో మౌనం వహిస్తారా? కూతురు కవిత చేస్తున్న తీవ్ర ఆరోపణలకు సమాధానం చెపుతారా లేదా?ఆమెతో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఏవిధంగా వ్యవహరించాలో చెపుతారా లేదా? అనేవి చాలా ఆసక్తి కలిగించే విషయాలే!


Related Post