తెలంగాణ బీజేపిలోకి నటి ఆమని.. ఏం ప్రయోజనం?

December 20, 2025


img

సినీ నటీనటులు రాజకీయ పార్టీలలో చేరడం కొత్త విషయమేమీ కాదు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి ఆమనికి ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గాయి. బహుశః అందువల్లేనేమో తెలంగాణ బీజేపిలో చేరారు. నేడు హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు ఆమనిని సాదరంగా బీజేపిలోకి ఆహ్వానించారు. ఆమెతో పలువురు మహిళలు బీజేపిలో చేరారు. 

సినీ పరిశ్రమలో వారు బీజేపిలో చేరినంత మాత్రాన్న తెలంగాణలో బీజేపి బలోపేతం కాదు. ఆధికారంలోకి వచ్చేయదని అందరికీ తెలుసు. నాడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ బీజేపి అధిష్టానంపై నిత్యం కత్తులు దూస్తుండేవారు. సాక్షాత్ ప్రధాని మోడీ హైదరాబాద్‌ వస్తే కనీసం విమానాశ్రయానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆహ్వానించేవారు కాదు. పైగా హైదరాబాద్‌ నగరమంతా ప్రధాని మోడీ తీరుని విమర్శిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు వేలిసేవి. మోడీని గద్దె దించుతానంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని రాష్ట్రాలు పర్యటించారు. మహారాష్ట్రలో బీజేపిని ఓడించేందుకు 600 కార్లతో దండయాత్ర కూడా చేశారు. 

అలాంటి కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ పార్టీని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతోందని అందువల్లే ఏ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరులను అరెస్ట్‌ చేయలేకపోతున్నామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. కనుక రాష్ట్ర రాజకీయాలలో బీజేపి అధిష్టానం ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు పార్టీలో ఎవరిని చేర్చుకున్నా ఏం ప్రయోజనం? 


Related Post