మరో పది రోజుల్లో 2025 ముగిసిపోతోంది. ఈ ఏడాది తెలంగాణ రాజకీయాలలో మూడు ప్రధాన పార్టీల పరిస్థితిని ఓ సారి బేరీజు వేసుకొని చూడాల్సిన సమయం ఇదే.
కాంగ్రెస్ పార్టీ: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగా దూసుకుపోతోంది. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో సగానికి పైగా స్థానాలు దక్కించుకొని 2025ని కాంగ్రెస్ పార్టీ చక్కగా ముగిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ: ఈ ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి అనేక అపజయాలు, ఎదురుదెబ్బలు తగిలాయి. వరుస ఓటములు, కల్వకుంట్ల కవిత బహిష్కరణ, నిత్యం ఆమె బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు, వాటికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ సమాధానం చెప్పలేని నిసహాయత వంటివి చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ కోలుకోగలదా?అనే సందేహం కలుగుతుంది.
పార్టీ పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతున్నా కేసీఆర్ ఫామ్‌హౌసు నుంచి బయటకు రాకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తోంది. కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ కేటీఆర్, హరీష్ రావులిద్దరూ కలిసి అలుపెరుగని పోరాటాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 25శాతం పైగా సీట్లు దక్కించుకోవడంతో దాని బలం ఏమాత్రం చెక్కుచెదరలేదని స్పష్టమైంది.
బీజేపి: 2023 ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అనుకునే స్థితిలో ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపి ఉందా లేదా? అనుకునే స్థాయికి దిగజారిందని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ నాయకులు కుమ్ములాడుకుంటూ పార్టీని దెబ్బ తీసుకుంటారని అందరికీ తెలుసు. కానీ తెలంగాణ బీజేపిలో నాయకులకు కూడా ఈ కుమ్ములాట సంస్కృతి అలవారుచుకున్నారు. అందువల్లే పంచాయితీ ఎన్నికలలో బీజేపి నాలుగో స్థానానికి పరిమితమైంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడినప్పుడు దాని స్థానంలోకి బీజేపి వస్తుందనుకుంటే, బీఆర్ఎస్ పార్టీయే పుంజుకొని రెండో స్థానంలో వచ్చింది. బీజేపి తన మూడో స్థానం చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ అక్కడే సెటిల్ అయిపొయింది.
ఇప్పుడీ మూడు పార్టీలని బేరీజు వేసి చూస్తే, పూర్తిగా తుడిచిపెట్టుకుపోటుందనుకున్న బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి పోరాడి మళ్ళీ పుంజుకుంటోందని స్పష్టమవుతుంది.