ఈ నెల 29 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల పంపకాలపై చేసిన విమర్శలు, ఆరోపణలపై చర్చించారు. వాటన్నిటికీ శాసనసభ సమావేశాలలో బయట కూడా జవాబు చెప్పి సమర్ధంగా తిప్పి కొట్టాలని నిర్ణయించారు.
ఈ నెల 29 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించి ‘నీళ్ళు-నిజాలు’ అనే అంశంపై లోతుగా చర్చించి కేసీఆర్ హయంలో జరిగిన అవినీతి, తప్పుడు నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తప్పుడు నిర్ణయం వలన ఆయా జిల్లాలకు, రాష్ట్రానికి కలిగిన నష్టం గురించి సభలో వివరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 30,31, జనవరి 1వ తేదీలలో కొత్త సంవత్సరం వేడుకలు ఉంటాయి కనుక మళ్ళీ జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేడో రేపో శాసనసభ సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.