రేపు (ఆదివారం) ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాడేపల్లిలో ఆయన ఇంటికి వెళ్ళే దారిలో వైసీపీ నేతలు, జగన్ అభిమానులు భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పెట్టారు.
అదేమీ పెద్ద విచిత్రం కాదు. కానీ వాటిలో ఓ కటవుట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే దానిలో జగన్ వెనుక కేసీఆర్, కేటీఆర్ బొమ్మలున్నాయి.
2019 ఎన్నికలలో వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ చాలా తోడ్పడ్డారనే సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచే జగన్‌కి, ఆయన అభిమానులకు కూడా కేసీఆర్ అంటే అభిమానం ఏర్పడింది. అదే ఇప్పుడు ఈవిధంగా బయట పడిందనుకోవచ్చు.
కేసీఆర్, కేటీఆర్‌లను కాంగ్రెస్, బీజేపి నేతలు ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ, పొరుగు రాష్ట్రంలో ప్రజలు, ఓ రాజకీయ పార్టీ, దాని అభిమానులు వారి పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపుతుండటం గొప్ప విషయమే కదా?
అంటే కేసీఆర్, కేటీఆర్ గొప్పదనాన్ని పొరుగు రాష్ట్రంలో ప్రజలు గుర్తించారు కానీ తెలంగాణలో పార్టీలు గుర్తించలేదనుకోవాలేమో?