భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాల జాబితాలో నేడు మరో ఘన విజయం నమోదు చేసుకుంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోని దాని కక్ష్యలో ప్రవేశపెట్టింది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 8.55 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. కేవలం పదిహేను నిమిషాలలోనే ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ 520 కిమీ ఎత్తున అంతరిక్షంలోని నిర్దిష్ట కక్ష్యలో బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగంలో అనేక ప్రత్యేకతలున్నాయి. 1. ఇస్రో మూడవ అంతరిక్ష వాణిజ్య ప్రయోగం, 2. బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువే సుమారు 6,200 కేజీలు, 3.ఈ బాహుబలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి ఇస్రోకి అత్యంత నమ్మకమైన బాహుబలి వంటి ఎల్‌వీఎం3-ఎం6 భారీ రాకెట్‌ని కేవలం మూడు నెలల్లో తయారుచేశారు.
అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల కొరకు ఇస్రోకు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. ఇది అమెరికాకు చెందినా ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇస్రో ద్వారా ఈ ప్రయోగం పూర్తి చేసింది.
ఈ బాహుబలి రాకెట్, బాహుబలి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌కి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు రేయింబవళ్ళు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
India's Bahubali majestic lift off 😍#LVM3M6 🚀 pic.twitter.com/pZkC3sxshA
— Sravani (@sravani_darsi) December 24, 2025