నాడు జీసస్ జన్మించినప్పటి నుంచి ఆయనని శిలువవేసే వరకు ఎటువంటి అరాచక పరిస్థితులు ఉండేవో చరిత్ర చెపుతోంది. 2025 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేటికీ ప్రపంచంలో అటువంటి అరాచక పరిస్థితులే నెలకొని ఉండటం చాలా బాధ కలిగిస్తుంది.
ఈ మధ్యకాలంలో ఎంతోమంది మేధావులు, తత్వవేత్తలు, శాంతికాముకులు, మతగురువులు యధాశక్తిన సమాజాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. వారు చెప్పిన మంచి మాటలను, మంచి లక్షణాలను ఎవరూ చెవికెక్కించుకోలేదు. కానీ వారికి వంద, రెండు వందల అడుగుల విగ్రహాలు కట్టేశారు.
వారి జయంతులు, వర్ధంతులు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అన్నిటికీ వారి పేర్లు, ఫోటోలు తగిలిస్తున్నారు. అదే వారి పట్ల తమకున్న నిబద్దతగా భావిస్తున్నారు. జనాలను కూడా నమ్మిస్తున్నారు.
నాడు జీసస్ మనుషులలో ప్రేమ, కరుణ, క్షమాగుణం ఉండాలని చెప్పారు. వాటి కోసమే అయన శిలువపై తన ప్రాణాలు విడిచారు. కానీ నేటి సమాజాన్ని, ప్రపంచాన్ని, దానిలో జరుగుతున్న హింసని చూస్తున్నప్పుడు అయన ప్రాణ త్యాగం వృధా అయిపోయింది కదా? అనిపించక మానదు.
ప్రపంచంలో మనుషులందరూ సుఖంగా, సంతోషంగా జీవించాలని జీసస్ క్రీస్తు కోరుకున్నారు. కానీ అయన చెప్పిన మంచి విషయాలు ఎంతమంది చెవికెక్కించుకున్నారు? అయన పేరుతోనే యుద్ధాలు, మత రాజకీయాలు చేస్తూనే ఉన్నారు కదా?
రేపు క్రిస్మస్ రోజున కేవలం బహుమతులు, మిటాయిలు మాత్రమే కాదు వాటితో పాటు సాటి మనుషులకు కాస్త ప్రేమను కూడా పంచాలి.
ఎంతకాలం జీవించి ఉంటామో తెలియని జీవితం జీవిస్తున్నాము. కనుక ఆ ముగింపుకు ముందే జీవితం సార్ధకం చేసుకోవడం చాలా అవసరం. అందుకు క్రిస్మస్ కంటే శుభదినం మరేముంటుంది?