సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటలిజన్స్ మాజీ అధినేత ప్రభాకర్ రావుని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకి జనవరి 3న శాసనసభ సమావేశం ముగియగానే నోటీస్ ఇవ్వబోతున్నారు. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పడం విశేషం.
హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ‘సిట్’ ఏర్పాటు ఓ ప్రహసనంలా మారింది. అధికార పార్టీకి చెప్పినవారిపై కేసులు నమోదు చేయడం, వారికి అనుకూలంగా విచారణ జరిపి, నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.
జనవరి 3వ తేదీ శాసనసభ సమావేశం ముగియగానే ఈ కేసులో నాకు నోటీస్ ఇవ్వాలని సిట్ అధికారులకు పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు నాకు సమాచారం ఉంది. పంచాయితీ ఎన్నికల ఫలితాలు, కేసీఆర్ సమావేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఆ భయం, ఆందోళనలతోనే నాపై ఈ తప్పుడు కేసుకి సిద్ధమవుతోంది.
నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఈ కేసులు, నోటీసులు చూసి భయపడేవాడిని కాదు. ఉద్యమ సమయంలో ఇంతకంటే చాలా ఎక్కువ కేసులు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాను. కానీ సిఎం, మంత్రుల ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు ప్రతిపక్ష నేతలపై వేధింపులకు పాల్పడితే తర్వాత ఏం జరుగుతుందో ఏపీలో అధికారులను చూస్తే తెలుస్తుంది కదా? తెలంగాణ అధికారులకు భవిష్యత్తులో అలాగే జరుగుతుంది,” అని హరీష్ రావు హెచ్చరించారు.