తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.
దీనిపై కేంద్ర మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ, “అనేక టీవీ సీరియల్స్ పూర్తయిపోయాయి. కానీ ఈ కేసు విచారణ మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేస్తున్నందుకు చాలా సంతోషం. కేసీఆర్ తన కూతురు, అల్లుడు, సొంత పార్టీ నేతలని కూడా విడిచిపెట్టకుండా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు దండుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నో కుటుంబాలలో చిచ్చు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వలన తెలంగాణ ప్రతిష్ట మంట గలిసిపోయింది.
ఈ కేసులో వారికి నోటీసులు ఇచ్చి సరిపెట్టకుండా సమగ్రంగా విచారణ జరిపి వారికి శిక్షలు పడేలా చేసినప్పుడే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది,” అని బండి సంజయ్ అన్నారు.
జనవరి 3వ తేదీన సిట్ అధికారులు తనకు నోటీస్ ఇవ్వబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పారు.
కనుక కొత్త సంవత్సరం మొదట్లోనే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవడం ఖాయం. ఈ కేసు విచారణ ఎంత దూరం వెళుతుందో, ఎప్పుడు ఎలా ముగుస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.