మొన్న ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ సిఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి నీటిని ఏపీకి దోచిపెడుతూ రాష్ట్రంలో రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. తాను పదేళ్ళలో ఎంతో కష్టప్పడి వ్యవసాయం, సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించేశారని ఆరోపించారు.
కేసీఆర్ ఆరోపణలపై రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్దాలను నిజమన్నట్లు ప్రచారం చేయడంలో వారికి వారే సాటి. మొన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే.
ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్నేళ్ళలో పాలమూరు-రంగారెడ్డి, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదు?అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి జిల్లాల గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
కేవలం తనకు మాత్రమే తెలివితేటలున్నాయని, ప్రపంచంలో మరెవరికీ లేవన్నట్లు మాట్లాడటం కేసీఆర్‌కి అలవాటే. నిజానికి పదేళ్ళపాలనలో సాగునీటి రంగంలో చేసిన అభివృద్ధి కంటే చేసిన నష్టమే ఎక్కువుంది.
పదేళ్ళలో మొత్తం బడ్జెట్ రూ.17.72 లక్షల కోట్లు కాగా దానిలో కేవలం రూ.1.83 లక్షల కోట్లు మాత్రమే సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. అదీ ఎక్కువ వడ్డీకి తక్కువ కాలంలో తిరిగి చెల్లించే అప్పులు చేశారు. ఆయన చేసిన ఆ అప్పులు, వడ్డీలే ఏడాదికి రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నామిప్పుడు. త్వరలోనే అసలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాయిదాలు కూడా మొదలైతే ప్రభుత్వంపై భారం మరింత పెరుగుతుంది.
ఇన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించినా కాళేశ్వరంతో సహా అనేక ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయి. కేసీఆర్ చేసిన అప్పుల భారం రాష్ట్రంలో రైతులతో ప్రజలందరిపై పడుతోంది. ఇప్పటి తరమే కాదు తర్వాత తరంపై కూడా ఈ అప్పుల భారం పడుతుంది.
ఇంత విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రానికి, రైతులకు తాను ఏదో గొప్ప మేలు చేశానన్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు,” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.