దానం నాగేందర్ రాజీనామాకు సిద్దపడ్డారా?

December 24, 2025


img

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని, కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడారు. “మిగిలిన (ఫిరాయింపు) ఎమ్మెల్యేల సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నాను. మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి హైదరాబాద్‌లో ప్రచారం చేస్తాను. జీహెచ్ఎంసీ ఎన్నికలలో మజ్లీస్ పార్టీతో కలిసి 300 సీట్లు గెలుచుకుంటాము,” అని అన్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్‌ కూడా ఒకరు. కనుకనే అయనపై కూడా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌ పార్టీ కోరుతోంది. కానీ తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్‌  చెప్పడం ఓ విధంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని, కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టినట్లే అవుతుంది. 

దానం నాగేందర్‌ స్వయంగా తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నానని చెప్పుకున్నారు కనుక ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్‌ పార్టీ పట్టుబట్టవచ్చు. అందుకు అయన అంగీకరించకపోతే సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళి అనర్హత వేటు వేయాల్సిందిగా కోరవచ్చు.

అయితే దానం నాగేందర్‌ ఈవిధంగా ఎందుకు మాట్లాడారు? అనే సందేహం కలుగుతుంది. బహుశః అయన శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామా చేయాలనుకుంటున్నారేమో?


Related Post