బిజెపి టార్గెట్ ఏపీ సిఎం జగన్?

January 16, 2020


img

బిజెపికి తెలంగాణలోనే కాస్త బలం, ప్రజాధారణ ఉన్నప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం, తెరాస పార్టీ రెండూ కూడా చాలా బలంగా ఉన్నందున రాష్ట్రంలో బిజెపి అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఏపీలో బిజెపి బలహీనంగా ఉంది. పెద్దగా ప్రజాధారణ కూడా లేదు. కానీ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బిజెపికి చాలా అనుకూలంగా ఉన్నాయి. 

సిఎం జగన్ తీసుకొంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా అప్పుడే ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. రాజధాని విషయంలో టిడిపి, వైసీపీ, బిజెపి, వామపక్షాలు వినిపిస్తున్న భిన్నవాదనల కారణంగా రాష్ట్రంలో ఒకరకమైన గందగరగోళం నెలకొని ఉంది. ఒకప్పుడు జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో ఎటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయో, ఇప్పుడు ఏపీలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కనుక ఆనాడు తమిళనాడులో కేంద్రప్రభుత్వం ఏవిధంగా తెర వెనుక పావులు కదిపి తనకు (బిజెపికి) అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొందో అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్నట్లుంది.  

ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇప్పటి వరకు పరస్పరం విమర్శలు గుప్పించుకొన్న ఏపీ బిజెపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్దమవుతున్నాయి. ఆ రెండు పార్టీల నేతలు గురువారం మధ్యాహ్నం విజయవాడలో సమావేశం అయ్యారు. తాము జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొనేందుకే భేటీ అవుతున్నామని వారు బహిరంగంగానే చెపుతున్నారు. 

ఇక ఆ రెండు పార్టీలు టిడిపిని దూరంగా పెడుతున్నప్పటికీ వాటన్నిటి ఉమ్మడి శత్రువు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వమే కనుక ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అవి కలిసి పనిచేయడం ఖాయమే. మరోపక్క సిబిఐ కోర్టులో జగన్, విజయసాయిరెడ్డిల అక్రమాస్తుల కేసుల విచారణలో కూడా మళ్ళీ కదలికలు పెరిగాయి. అంటే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగుసుకొంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయి.


Related Post