ఆర్టీసీ కార్మికులూ...పాలాభిషేకాలకు సిద్దంకండి

January 08, 2020


img

ఆర్టీసీ కార్మికులు తాను చెప్పినట్లు విని బుద్ధిగా పనిచేసుకొన్నట్లయితే ఏడాది తిరిగేసరికి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించి సింగరేణి తరహాలో ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు పండుగ బోనస్ అందజేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆర్టీసీ కార్మికులు అంతవరకు ఎదురుచూడకుండానే ఈ సంక్రాంతి పండుగకే వారికి బోనస్ ఇవ్వబోతున్నారు.

బోనస్ అంటే బోనస్ కూడా కాదు. 55 రోజుల సమ్మె కాలానికి పూర్తిజీతం చెల్లిస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ జీతాలనే సంక్రాంతి పండుగకు మూడు నాలుగు రోజులు ముందుగా అంటే జనవరి 11,12 తేదీలలోగా ఆర్టీసీ కార్మికుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమా చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఆర్టీసీ కార్మికులు పనిచేసిన సెప్టెంబర్ నెల జీతం ఇవ్వడానికే మొదట నిరాకరించిన సిఎం కేసీఆర్‌, 55 రోజుల సమ్మె కాలానికి జీతం ఇస్తుండటం బోనస్‌గానే భావించక తప్పదు. కనుక ఆర్టీసీ కార్మికులు మళ్ళీ సిఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలకు సిద్దం కావాలి.  

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తునందుకు చాలా సంతోషం. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు జీవితాలు మళ్ళీ మెల్లగా గాడిలో పడుతున్నందుకు చాలా చాలా సంతోషం. 


Related Post