బండ్లగూడ జాగీర్‌లో ఆటో ఛార్జీ రూ.5లు మాత్రమే!

January 06, 2020


img

ఆర్టీసీ సైతం 20 శాతం ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుభారం మోపుతుంటే, రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ జాగీర్ గ్రామానికి చెందిన నాగుల నరేందర్, స్రవంతి దంపతులు కేవలం రూ.5లకే తమ బస్తీలో ఆటో సేవలను అందజేస్తున్నారు. 

బండ్లగూడ జాగీర్ గ్రామంలో నివశిస్తున్నవారు బస్సు, ఆటో సౌకర్యం లేకపోవడంతో, ఉద్యోగులు, విద్యార్దులు, రోగులు, పెన్షన్‌దారులు తదితరులకు మూడు కిలోమీటర్లు కాలినడక తప్పడం లేదు. ఇతరప్రాంతాలకు వెళ్ళినవారు చీకటిపడిన తరువాత తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలకు ఒక పరిష్కారం చూపాలని భావించిన నాగుల నరేందర్, స్రవంతి దంపతులు రూ.2.5 లక్షలు పెట్టి ఒక ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. దానికి కేవలం రూ.5లు మాత్రమే ఛార్జీ పెట్టారు. అదీ ఇవ్వలేనివారికి ఉచితంగానే సేవలు అందజేస్తున్నారు. దానికి మంచి స్పందన రావడంతో మరో నాలుగు ఆటోలను కొనుగోలుచేసి ఈ-ఆటో పేరుతో ప్రజలకు అందుబాటులో ఉంచారు. పండుగలు, శలవు దినాలు, ఆదివారాలు తప్ప మిగిలిన అన్ని రోజులు ఈ ఆటోలు ఉదయం 6.30 నుంచి రాత్రి 12 గంటలవరకు అవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 

ప్రయాణికుల భద్రత కోసం వాటిలో సిసి కెమెరాలు, జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. వాటిని వినియోగించుకొనేందుకు గణేశ్ ఎక్స్‌ప్రెస్‌ అనే ఓ మొబైల్ యాప్ కూడా రూపొందించారు. దాని ద్వారా ఈ-ఆటోలను ముందుగానే బుక్‌ చేసుకొని ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఆటో ఎక్కడుంది. ఎంతసేపటిలో అది గమ్యానికి చేరుకొంటుంది? ఆటో డ్రైవర్ పేరు, ఫోన్‌ నెంబర్ వగైరా అన్ని వివరాలు ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.  గ్రామంలోని రోగులెవరైనా ఆసుపత్రికి వెళ్లదలిస్తే ఈ-ఆటోలు ఇంటికే వచ్చి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి, మళ్ళీ భద్రంగా ఇంటికి తీసుకువచ్చి దింపుతారు. దీనికోసం రానూపోనూ కలిపి రూ.20 చెల్లిస్తే చాలు. అదే ఆసుపత్రికి వెళ్ళేందుకు లేదా ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చేందుకు మాత్రమే అయితే ఉచితంగానే తీసుకువెళతారు. నామమాత్రపు ఛార్జీలకే ఇంత భద్రమైన, సౌకర్యవంతమైన ఆటో సేవలు అందిస్తుండటంతో బండ్లగూడ జాగీర్ గ్రామ ప్రజలు ముఖ్యంగా..విద్యార్ధులు, మహిళలు, వృద్ధులు, రోగులు నాగుల నరేందర్, స్రవంతి దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.


Related Post