ఉన్నావ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు

December 16, 2019


img

ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ను దోషి అని డిల్లీలో తీస్ హజారీ కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. ఈనెల 19న అతనికి శిక్ష ఖరారు చేస్తామని ఈ కేసుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ధర్మేష్ శర్మ ప్రకటించారు. ఈ కేసులో మరో నిందితుడిగా పేర్కొనబడిన శశి సింగ్‌ను నిర్ధోషిగా ప్రకటించారు. 

రెండేళ్ళ క్రితం ఉన్నావ్‌లోని ఓ మైనర్ బాలికను బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ అనుచరులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. కుల్‌దీప్‌ సెంగార్‌ యూపీలోని బంగేర్మౌ నియోజకవర్గం నుంచి వరుసగా 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో అతనికి ఎదురుచెప్పేవారే లేరక్కడ. ఆ కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మొదట కేసు నమోదు చేయలేదు. కానీ ఈ విషయం మీడియాకు, మానవహక్కుల సంఘానికి పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి కుల్‌దీప్‌ సెంగార్‌ను అరెస్ట్ చేశారు. 

గత వారం ఆమె రాయ్ బరేలీ కోర్టుకు వెళుతునప్పుడు, అతని సహచరులు దారిలో ఆమెను వెంటాడి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఆ మంటలలో 90 శాతంకు పైగా కాలిన గాయాలతో భాధితురాలు మరణించింది. ఆమెపై హత్యాప్రయత్నం చేసినందుకు పోలీసులు అతని సహచరులు శివం త్రివేది, శుభం త్రివేదిలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 

ఈ కేసులో దోషులను శిక్షించడంలో విఫలమైనందునే వారు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయగలిగారని, కనుక సెంగర్‌తో సహా ఆమెపై హత్యాచారానికి పాల్పడినవారందరికీ కూడా ఉరిశిక్షలు విధించబడాలని యావత్ దేశప్రజలు కోరుకొంటున్నారు. మరి కోర్టు ఏ శిక్ష విధిస్తుందో ఈనెల 19న తెలుస్తుంది.


Related Post