ఏపీ, తెలంగాణ సిఎంల స్నేహం ముగిసినట్లేనా?

December 16, 2019


img

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యేందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌, తెరాస నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా వారిరువురి మద్య మంచి సఖ్యత ఏర్పడింది. వారిరువురి చొరవతో కొన్ని విభజన సమస్యలు చకచకా పరిష్కారం అయ్యాయి. 

ఆ తరువాత కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం కోసం తెలంగాణ సిఎం కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడమే కాక దానిపై ఆయనతో ప్రగతి భవన్‌లో ముఖాముఖీ చర్చలు జరిపారు కూడా. కానీ చివరికి ఆ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం విముఖత చూపడంతో అది అటకెక్కింది. అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరు సిఎంలు భేటీ అవ్వలేదు. అలాగే విభజన సమస్యలపై చర్చలు నిలిచిపోయాయి. అంటే పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణగా, విద్యుత్ ఉద్యోగుల పంపకాల ప్రతిష్టంభనను చెప్పుకోవచ్చు. 

తెలంగాణ విద్యుత్ సంస్థలలో ఏపీ స్థానికత కలిగిన 1,157 మందిని 2015లో రిలీవ్ చేయబడ్డారు. అప్పుడు ఇరువురు సిఎంల మద్య సఖ్యత లేని కారణంగా వారిని ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి నిరాకరించింది. అయితే కేసీఆర్‌-జగన్ మద్య మంచి సఖ్యత ఉన్నందున ఈ సమస్యను వారు సులువుగానే పరిష్కరించగలరని 1,157 మంది ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ మళ్ళీ వారిరువురి మద్య దూరం పెరిగినందునో ఏమో...నేటికీ ఆ 1,157 మంది ఉద్యోగుల భవిష్యత్‌ ఆగమ్యగోచరంగానే ఉండిపోయింది. 

ఈసమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయన రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో గత రెండు రోజులుగా ఈ సమస్యపై చర్చించారు. కానీ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు మెట్టు దిగకపోవడంతో విచారణ ముగించినట్లు ధర్మాధికారి ప్రకటించారు. 

ఇంతకీ సమస్య ఏమిటంటే... 

తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన 1,157 మందిలో 613 మంది ఏపీలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారు. వారిని తీసుకొన్నట్లయితే మిగిలినవారిని వెనక్కు తీసుకొంటామని తెలంగాణ అధికారులు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ స్థానికత కలిగిన 256 మంది ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. వారు తెలంగాణకు తిరిగి రావాలనుకొంటున్నారు. ఒకవేళ ఏపీ అధికారులు తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే 256లో సగం మంది అంటే 128మందిని తెలంగాణలోకి తీసుకొంటామని అధికారులు చెప్పారు. కానీ ఏపీ అధికారులు ఈ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించడంతో ఈ సమస్య ఇక రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాదని భావించిన జస్టిస్ ధర్మాధికారి, విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై విచారణ ముగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పిస్తానని దాని ఆధారంగా సుప్రీంకోర్టే తగిన నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. 

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురు సిఎంలు భేటీ అయిన తరువాత వారి మద్య సఖ్యత పెరగడంతో ఇకపై కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టుల జోక్యం ప్రమేయం లేకుండా రెండు రాష్ట్రాలకు సంబందించిన సమస్యలన్నిటినీ రాష్ట్ర స్థాయిలోనే చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొంటామని చెప్పారు. కానీ ఆ మాట చెప్పి మూడు నెలలు తిరక్క మునుపే విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో తలపడనున్నాయి.


Related Post