తెలంగాణ పోలీసులు శభాష్: మంత్రి గంగుల

December 06, 2019


img

దిశ కేసులో నలుగురు నిందితులు ఈరోజు తెల్లవారుజామున తమపై దాడి చేసి తప్పించుకొని పారిపోతుండగా వారిని ఎన్‌కౌంటర్‌ చేశామని పోలీసులు చెపుతున్నారు కానీ జరిగిందేమిటో అందరూ ఊహించగలరు. కనుక దిశ ఘటనతో తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రజలు, ప్రముఖులు పోలీసులు చేసిన పనిని హర్షిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ గురించి నోరు జారలేదు. నిందితులు తమపై దాడి చేసి పారిపోతుంటే ఎన్‌కౌంటర్‌ చేశామనే చెపుతున్నారు కానీ మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ, “సరిగ్గా అంబేడ్కర్ జయంతి రోజే నిందితుల ఎన్‌కౌంటర్‌ జరగడం నిజమైన నివాళిగా భావిస్తున్నాను. ఇదీ తెలంగాణ పోలీసుల సత్తా! ఇకపై రాష్ట్రంలో ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టాలి. ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్రం అత్యంత సురక్షితమైనది,” అని అన్నారు. 

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న గంగుల కమలాకర్ కూడా పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే నిందితులను అక్కడకు తీసుకువెళ్లి ఎన్‌కౌంటర్‌ చేశారన్నట్లు... అది చాలా గొప్ప విషయమన్నట్లు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే నిజమనుకొంటే ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నందుకు కోర్టులో దోషులుగా నిలబడవలసి వస్తుందని మంత్రిగారు గ్రహించినట్లు లేదు. సామాన్య ప్రజలు, ప్రముఖులు అత్యుత్సాహంతో స్పందించడం సహజమే కానీ ఇటువంటప్పుడు ఆచితూచి మాట్లాడవలసిన వారే ఈవిదంగాఎన్‌కౌంటర్‌ చేయడం చాలా గొప్ప విషయమన్నట్లు మాట్లాడటం, అందుకు పోలీసులను పొగడటం సరికాదనే చెప్పాలి.


Related Post