ఉల్లి సంక్షోభం... ఎప్పుడూ ఇంతేనా?

December 05, 2019


img

ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలలో ఉల్లిపాయల ధర కిలో రూ.100-125కు చేరుకొంది. అవి కూడా అంత నాణ్యమైనవి కావు. నిత్యావసర వస్తువైన ఉల్లి ధరలు ఇంతగా పెరిగిపోవడంతో అంతా ధర పెట్టి కొనలేక అలాగని కొనక తప్పక దేశప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

ఉల్లి ధర రూ.50 దాటిన తరువాత కానీ కేంద్రప్రభుత్వం మేల్కొనలేదు. అప్పుడు హడావుడిగా విదేశాల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి రోజూ లక్షల టన్నులు అవసరమైతే వేల టన్నులలో దిగుమతవుతుండటంతో ఉల్లి సరఫరా ఏమాత్రం మెరుగుపడలేదు. దాంతో నెలరోజులుగా ఉల్లి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప దిగిరావడం లేదు. 

ఉల్లి కొరతపై బుదవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చాలా ఆశ్చర్యకరమైన జవాబు చెప్పారు. “నేను ఉల్లి, వెల్లుల్లి అంతగా తినను. అటువంటి కుటుంబం నుంచి వచ్చాను,” అంటూ సమాధానం మొదలుపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తమ ప్రభుత్వం వివిద విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న, ఇంకా చేసుకోబోతున్న ఉల్లికి సంబందించి గణాంకాలు చెప్పారు. దేశ ప్రజలు ఉల్లి లభించక అల్లాడుతుంటే జనవరి నెలలోగా మరింత సరుకు దిగుమతి అవుతుందని అప్పుడు ఉల్లి కొరత తగ్గవచ్చునని ఆమె చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.  

ప్రతీ రెండుమూడేళ్ళలో ఒకసారైనా దేశంలో ఉల్లి కొరత ఏర్పడుతూనే ఉంది. దానికి కారణాలు ఏమిటో కనుగొని, ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, ఉల్లి సంక్షోభం తలెత్తి...ధరలు ఆకాశానికి చేరిన తరువాత ప్రభుత్వం హడావుడిగా విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకొంటోంది. ఇదే ఈ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నట్లుంది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడమే లేదు. 

పోనీ ఉల్లి ధరలు ఇంతగా పెరిగాయి కనుక దేశంలో రైతన్నలేమైనా లాభపడుతున్నారా? అంటే అదీ లేదు. దళారులు... వ్యాపారులే లాభపడుతున్నారు. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని గ్రహించగానే ముందుగానే సరిపడినంత సరుకు కొని ఉంచుకొని ఇటువంటప్పుడు అమ్ముకొని లాభాలు ఆర్జిస్తున్నాడు. కానీ ప్రభుత్వానికి ఆ మాత్రం ముందు చూపులేకపోవడం ప్రజల దురదృష్టమేననుకోవాలి. 

ఏ వస్తువునైనా తయారు చేయవచ్చునేమో కానీ అమ్ముకోవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఇంత భారీ డిమాండ్ ఉన్న ఉల్లి వంటి నిత్యావసర సరుకును సరిపడినంత ఎందుకు ఉత్పత్తి, నిలువ చేసుకోలేకపోతున్నాము? తద్వారా మన రైతన్నలకు ఎందుకు మేలు చేయలేకపోతున్నాము? అని ప్రభుత్వాలు ఆలోచించకపోవడం బాధాకరమే. 

కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ఉల్లి, వెల్లుల్లి తినకపోతే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆమె తినరు కనుక దేశప్రజల కష్టం అర్ధంకానట్లు మాట్లాడితేనే వేలెత్తి చూపవలసివస్తుంది. ఉల్లి సంక్షోభం తలెత్తినప్పుడు హడావుడిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే పరిష్కారం అనుకోకుండా  ఇకనైనా దేశంలో ఉల్లి పంటను పెంచడానికి తగిన చర్యలు చేపట్టి, ఉల్లిని నిలువ చేయడానికి దేశవ్యాప్తంగా తగినన్ని గోదాములు నిర్మిస్తే బాగుంటుంది.


Related Post