మహారాష్ట్ర సిఎం, డెప్యూటీ సిఎం రాజీనామా

November 26, 2019


img

మహారాష్ట్ర రాజకీయాలు నేడు మరో అనూహ్య మలుపు తిరిగాయి. రేపు సాయంత్రంలోగా శాసనసభలో బలనిరూపణ చేసుకోమని సుప్రీంకోర్టు గడువు విధించడంతో బిజెపి షాక్ అయ్యింది. మరికొన్ని రోజులు గడువు ఇచ్చిన్నట్లయితే ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో తమవైపు తిప్పుకొని అధికారం నిలబెట్టుకోవాలనుకొంది బిజెపి. కానీ సుప్రీంకోర్టు రేపటివరకే గడువు ఇవ్వడంతో ఆలోగా 20-25 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోలేమని అర్ధం కాగానే సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, డెప్యూటీ సిఎం అజిత్ పవర్ ఇద్దరూ తమ పదవులకు మంగళవారం మధ్యాహ్నం రాజీనామాలు చేశారు. వారిరువురూ శనివారం ఉదయమే ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వారిది మూన్నాళ్ళ ముచ్చటైంది. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 105 సీట్లు గెలుచుకొని బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ దానితో కలిసి పోటీ చేసిన శివసేనతో ముఖ్యమంత్రి పదవి పంచుకోవడానికి బిజెపి అంగీకరించలేదు. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. సిఎం, డెప్యూటీ సిఎంలు మూడు రోజులకే రాజీనామాలు చేయవలసి రావడం వాటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోయినపట్టికీ అత్యాశకు పోయినందునే బిజెపికి ఈ అవమానం ఎదురైందని చెప్పక తప్పదు. 

రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగం గొప్పదనం గురించి డిల్లీలో ఉపన్యాసం ఇచ్చినరోజే అందుకు విరుద్దంగా వ్యవహరించినందుకు మహారాష్ట్రలో బిజెపికి ఈ ఘోర అవమానం ఎదుర్కోవలసి రావడం విశేషమే కానీ ఇది స్వయంకృతాపరాధమే. 

బిజెపి తప్పుకోవడంతో మళ్ళీ ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కానున్నాయి. బహుశః ఈరోజు సాయంత్రం ఆ మూడు పార్టీల ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దతను తెలియజేయవచ్చు. గవర్నర్‌ అందుకు అంగీకరిస్తే…మళ్ళీ ఎటువంటి అనూహ్య పరిణామాలు జరుగకపోతే ఈ ఒకటి రెండు రోజులలో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. 


Related Post