ఆర్టీసీ సమస్యపై కేంద్రం వైఖరి ఏమిటో?

November 12, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్‌ చాలా చులకనగా, అహంభావంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో ఎందరో బలిదానాలు చేసుకొన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హక్కుల కోసం బలిదానాలు జరుగుతుండటం చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఏమీ అడగడం లేదు. గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీనే నెరవేర్చమని కోరుతున్నారు. కానీ అటువంటి హామీలేవీ ఈయలేదని సిఎం కేసీఆర్‌ బుకాయిస్తున్నారు.

విధులలో చేరని ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని వాదిస్తున్న సిఎం కేసీఆర్‌, గత ఐదున్నరేళ్ళలో ఏనాడూ సచివాలయంలో అడుగుపెట్టనందుకు ఎన్నిసార్లు డిస్మిస్ చేయాలి? ముఖ్యమంత్రి,  మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నెలనెలా జీతాలు అందుకోంటూనే ఉన్నారు కానీ సెప్టెంబర్ నెలలో పనిచేసిన రోజులకు ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? 

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులలో అగ్నిజ్వాలలు రగిలించారు. ఆ జ్వాలలోనే సిఎం కేసీఆర్‌ దహించుకుపోతారు. ఆర్టీసీ కార్మికులు సిఎం కేసీఆర్‌కు తప్పకుండా గుణపాఠం నేర్పిస్తారు. వారి సమ్మె అంగడిలో అమ్ముడుపోయే సరుకు కాదు....ఏవో పదవులు పడేసి కొనుక్కోవడానికి. ఆర్టీసీ కార్మికులకు బిజెపి అండగా నిలబడుతుంది,” అని అన్నారు. 

గత 39 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్టీసీ కార్మికులు, వారి భార్యా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆర్ధిక సమస్యలు భరించేలేక, తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయనే బెంగతో కొందరు కార్మికులు గుండెపోటుతో చనిపోతుంటే మరికొందరు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వారి మరణాల కారణంగా వారి కుటుంబాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోయింది. సమ్మె కొనసాగితే ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. కానీ కేవలం సమ్మెకు మద్దతు ప్రకటించి, సిఎం కేసీఆర్‌ను తిట్టిపోసినంత మాత్రన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డునపడకుండా కాపాడలేరని గ్రహించాలి.

ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడానికి హైకోర్టు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కాలేదు కనుక ఇకనైనా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ పరిస్థితిని చక్కదిద్దుతుందా లేదా? అనే ప్రశ్నకు కె.లక్ష్మణ్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీకి తన సమర్ధతను, ఆర్టీసీ కార్మికుల పట్ల తన చిత్తశుద్దిని నిరూపించుకోవడానికి ఇదే చక్కటి అవకాశం. దానిని  ఇప్పుడు నిరూపించుకోగలిగితే ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు, బందుమిత్రులే కాదు... రాష్ట్ర ప్రజలు సైతం బిజేపివైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 


Related Post