ఏడు చేపల కధలా మారిన ఆర్టీసీ కేసు

November 07, 2019


img

ఆర్టీసీ సమ్మె, బకాయిలపై హైకోర్టులో నడుస్తున్న కేసులో ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్న, ఒక సమస్య నుంచి మరో సమస్య వరుసగా పుట్టుకు వస్తుండటంతో ఈ వ్యవహారం చివరికి ఏడు చేపల కధలా మారింది. 

ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఆర్టీసీ కధ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు ఆర్టీసీ విభజన ప్రక్రియకు కేంద్రప్రభుత్వం ఆమోదం పొందలేదని, కనుక టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్దత లేదని కుండబద్దలు కొట్టారు. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రప్రభుత్వానికి 33 శాతం వాటా ఉందని కానీ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికానందున ఆ 33 శాతం టీఎస్‌ఆర్టీసీకి బదిలీ అవదని, అయినట్లు పరిగణించడం తప్పని తేల్చి చెప్పారు. అలాగే ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణ (టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు)కు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరలేదని స్పష్టం చేశారు. 

దీంతో ఆర్టీసీ కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి కోరకుండా ఏవిధంగా టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మను హైకోర్టు నిలదీసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశ్యంతో విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేశామని సునీల్ శర్మ జవాబు చెప్పారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభిస్తే, అందుకు అంగీకరించని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించాలనుకొంటే, అసలు టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్దతే లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇప్పుడు కధ ఈ కొత్త మలుపు తిరిగింది. 

టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్దత లేదని కేంద్రమే హైకోర్టులో చెప్పింది. ఆర్టీసీ విభజన జరుగలేదు కనుక నేటికీ తాము ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా వాదించారు. కనుక టీఎస్‌ఆర్టీసీలో పనిచేసే కార్మికులతో ఇక తమ ప్రభుత్వానికి సంబందమే లేదని, తెలంగాణలో పూర్తిగా ప్రైవేట్ సర్వీసులను నడిపించుకొంటామని వాదించడానికి తెలంగాణ ప్రభుత్వానికి మంచి అవకాశం లభించినట్లు కనిపిస్తోంది. 

ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగున్న కేంద్రప్రభుత్వానికి తెలియజేయకుండా, దాని అనుమతి తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్దమవుతోంది కనుక ఇప్పుడు తెలంగాణలోనే కాక ఏపీఎస్ ఆర్టీసీకి కూడా కొత్త చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. 


Related Post