ఆర్టీసీ సొసైటీ డబ్బు జమ చేయాల్సిందే: హైకోర్టు

November 07, 2019


img

ఆర్టీసీకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పైసా కూడా బాకీలేదని తెలియజేస్తూ ప్రభుత్వం నిన్న మూడు వేర్వేరు అఫిడవిట్లు హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోపుగా దాఖలైన మరో పిటిషన్‌పై బుదవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి టీఎస్‌ఆర్టీసీకి షాక్ ఇచ్చారు. 

టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్టీసీలోని “త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్” సహకార సంఘంలో డబ్బులు దాచుకొని అవసరమైనప్పుడు రుణాలు తీసుకొని వినియోగించుకొంటుంటారు. వారి బకాయిలను ఆర్టీసీ యాజమాన్యం వారి జీతాలు, పెన్షన్ సొమ్ములో నెలనెలా కోసుకొంటుంటుంది. ఆవిధంగా వసూలైన మొత్తాన్ని మళ్ళీ వారం రోజులలోపుగా సొసైటీ ఖాతాలో జమా చేయవలసి ఉంటుంది. కానీ అనేక ఏళ్లుగా జీతాలలో డబ్బు కోసుకోవడమే కానీ దానిని సొసైటీ ఖాతాలో తిరిగి జమా చేయకపోవడంతో ఆ బకాయిలు నేటికి రూ.530 కోట్లు అయ్యింది. 

ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకొన్న ఆ సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం తిరిగి చెల్లించకుండా వేరే అవసరాలకు వాడేసుకొందని, దానిని తక్షణం సొసైటీకి తిరిగి చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, రుణసహకార సంఘం కార్యదర్శి బి.మహేశ్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు బి.వై.రెడ్డి ఆర్టీసీ సమ్మె ప్రారంభం కాక మునుపు...అంటే ఈ ఏడాది మే నెలలో హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. 

ఆర్టీసీ బకాయిలపై హైకోర్టులో నేడు విచారణ జరుగుతున్న ఈ సమయంలోనే ఈ పాత కేసుపై కూడా విచారణ జరుగడం, మద్యంతర ఉత్తర్వులు వెలువడటం యాదృచ్చికమే అయినా అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. 

ఆ కేసుపై బుదవారం విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాలలోపుగా సొసైటీ ఖాతాలో రూ.200 కోట్లు జమా చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు...ఆ సొమ్ము తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ఎటువంటి సాకులు చెప్పరాదని, అలాగే గడువు అడగరాదని ఆర్టీసీ యాజమాన్యాన్ని ముందే హెచ్చరించారు.

ఆ కేసులో హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ‘ఆర్టీసీకి పైసా బాకీ లేమని అఫిడవిట్లు దాఖలు చేసిన ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కనుక ఈ సొసైటీ బాకీల వ్యవహారంపై హైకోర్టు మళ్ళీ నేడు ప్రభుత్వాన్ని నిలదీయకమానదు. 


Related Post