డెడ్‌లైన్‌ ముగిసింది...సమ్మె ముగియలేదు

November 02, 2019


img

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరేందుకు సిఎం కేసీఆర్‌ విధించిన మంగళవారం అర్ధరాత్రి డెడ్‌లైన్‌ ముగిసే సరికి సుమారు 300-400 మంది మాత్రమే అంగీకారపత్రాలు ఇచ్చి విధులలో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో, పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో, ఎన్నికలలో ఎదురేలేని సిఎం కేసీఆర్‌కు ఇది చాలా అవమానకరమైన పరిణామమే అని చెప్పక తప్పదు. అలాగే ఆయన హెచ్చరికలకు ఏ మాత్రం భయపడకుండా మిగిలిన 48,500 మంది ఆర్టీసీ కార్మికులు సంఘటితంగా నిలబడటం ఆర్టీసీ కార్మిక సంఘాల విజయంగానే చెప్పవచ్చు. వివిద జిల్లాలలో డిపోల వద్ద నిన్న అర్ధరాత్రి గడువు ముగిసేవరకు ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేసి సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 

ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతులు మంజూరు చేశామని, గడువులోగా ఆర్టీసీ కార్మికులు విధులలో చేరకపోతే మిగిలిన రూట్లలో కూడా ప్రైవేట్ బస్సులకు ఇచ్చేస్తామని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కానీ ఆర్టీసీలో కేంద్రప్రభుత్వానికి 31 శాతం వాటా ఉందని కనుక సిఎం కేసీఆర్‌ ఆర్టీసీని ఏకపక్షంగా ప్రైవేటీకరించలేరని, తమ ఉద్యోగాలను ఊడగొట్టలేరని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. గడువు ముగిసిన తరువాత కూడా సమ్మెను కొనసాగించడానికి ఆర్టీసీ కార్మికులు సిద్దపడినందున, ఇప్పుడు సిఎం కేసీఆర్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్‌ విధించడం ద్వారా సిఎం కేసీఆర్‌ తనకు తానే డెడ్‌లైన్‌ విధించుకొన్నట్లయిందని సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. 

అయితే ఈనెల 7న మళ్ళీ హైకోర్టులో దీనిపై విచారణ జరుగనుంది. ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే సుప్రీంకోర్టుకు వెళతామని సిఎం కేసీఆర్‌ ముందే ప్రకటించారు. కనుక హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత దానిని బట్టి సిఎం కేసీఆర్‌ ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 


Related Post