ఆ దాడులు ఎవరు చేశారు?

November 05, 2019


img

గత 31 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె చాలా ప్రశాంతంగా సాగుతోంది. కానీ మంగళవారం అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధులలో చేరాలని లేకుంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తామని సిఎం కేసీఆర్‌ తాజా హెచ్చరికలు చేసినప్పటి నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో ఇవాళ్ళ ఉదయం రెండు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. 

నిర్మల్ జిల్లాలో బైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయన డిపోకు వెళుతుండగా వెనుక నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొహంపై ముసుగు కప్పి దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన కాళ్ళకు, చేతులకు గాయాలయ్యాయి. ఆయనను బైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మంగళవారం ఉదయం కరీంనగర్‌ నుంచి మంధని వెళుతున్న ఆర్టీసీ బస్సుపై పెద్దపల్లి జిల్లా కూచిరాజుపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్ధాలు పగిలిపోయాయి. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. 

ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ఈ రెండు దాడులను ఖండించారు. వాటితో ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సంబందమూ లేదని అన్నారు. పోలీసులు విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని కోరారు. 

ఈరోజు అర్ధరాత్రితో సిఎం కేసీఆర్‌ పెట్టిన గడువు ముగుస్తుంది. ఆ తరువాత ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలోకి తీసుకోబోమని, రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని కేసీఆర్‌ స్పష్టంగానే చెప్పారు. కనుక ఆర్టీసీ కార్మికులే ఆవేశంతో ఈ దాడులకు పాల్పడ్డారా? లేక ప్రశాంతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఈవిధంగా బురద జల్లి వారిలో వారికి చిచ్చుపెట్టి తద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.


Related Post