విజయారెడ్డి హత్య వెనుక పెద్దలు?భర్త ఆరోపణ

November 05, 2019


img

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్య ఆవేశంతో జరిగిందిగా తాను భావించడం లేదని దానివెనుక ఎవరో కొంతమంది పెద్దలున్నారని ఆమె భర్త సుభాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, “అబ్దుల్లాపూర్‌మెట్‌ కార్యాలయంలో చాలా ఒత్తిళ్ళు ఉండటంతో నా భార్య అక్కడి నుంచి బదిలీ చేయించుకొనేందుకు ప్రయత్నించింది కానీ మూడేళ్లు సర్వీసు పూర్తి కానందున బదిలీ కాలేదు. బదిలీ అయ్యుంటే బ్రతికి ఉండేది. అయితే ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ నా భార్య ఏనాడూ దానిని ఇంట్లో కనబరిచేది కాదు. ఆమె హత్యపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించి నేరస్తులను కటినంగా శిక్షించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయారెడ్డి హంతకుడు కూర సురేశ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, అతని తండ్రి కృష్ణకు ఔటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకొని 2 ఎకరాల భూమి ఉంది. దానిపై వివాదం కొనసాగుతున్నందున రెవెన్యూ శాఖ పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయలేదు. కనుక అతను నిన్న విజయారెడ్డి వద్దకు వెళ్ళి పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరగా, ఆమె సమస్యను వివరించి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడంతో      ఆవేశపరుడైన సురేశ్ వెంట తెచ్చుకొన్న పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ఆమె సజీవదహనం అయిపోయింది. పాసు పుస్తకం లభించదనే బాధతోనే తాను కూడా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నానని సురేశ్ చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే సురేశ్ తండ్రి కృష్ణ, ఆయన సోదరుడు దుర్గాయ్య ఇందుకు పూర్తిభిన్నమైన కధ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. సురేశ్‌కు ఈ భూమి వ్యవహారాలేవీ తెలియవని తండ్రి కృష్ణ చెపుతుండగా, ఆరు నెలలుగా సురేశ్ రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నాడని దుర్గయ్య చెప్పారు. 

కనుక కృష్ణకు చెందిన 2 ఎకరాల విలువైన భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులో లేదా మరొకరో వివాదస్పదమైన ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం పొందాలని ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో విజయారెడ్డిని అడ్డుతొలగించుకొనేందుకు ఆవేశపరుడైన సురేశ్‌ను వెనుక నుంచి ప్రోత్సహించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సురేశ్ ఆమెను ఎందుకు అంత కిరాతకంగా హత్య చేశాడు? తాను కూడా ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు? ఈ హత్య వెనుక ఎవరెవరున్నారు? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు లభిస్తాయేమో చూడాలి. 


Related Post