ఆర్టీసీని ప్రైవేట్ పరం ప్రకటనతో తప్పుడు సంకేతాలు?

November 05, 2019


img

నవంబర్ 2న మంత్రివర్గ సమావేశం అనంతరం సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ శ్రేయోభిలాషిగా ఆర్టీసీ కార్మికులకు మరొక చివరి అవకాశం ఇస్తున్నాను. మంగళవారం అర్ధరాత్రిలోగా అందరూ బేషరతుగా విధులలో చేరినట్లయితే మీ ఉద్యోగాలు నిలుస్తాయి. లేకుంటే మీరు ఉద్యోగాలు కోల్పోతారు. మీపైనే ఆధారపడిన మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. నా మాట కాదని మీరు సమ్మె కొనసాగిస్తే ఆర్టీసీలో మిగిలిన రూట్లను కూడా ప్రైవేట్ వారికి అప్పగించేస్తాము. ఆ తరువాత తెలంగాణలో ఆర్టీసీ ఉండదు. మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వానిది తప్పు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే మీ తప్పవుతుంది. కనుక ఆర్టీసీ కార్మికులందరూ యూనియన్ నేతల మాయలో పడకుండా గడువులోగా విధులలో చేరి మీ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.  

గడువులోగా ఆర్టీసీ కార్మికులు విధులలో చేరకపోతే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తాం, రేపటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ ఉండబోదనే సిఎం కేసీఆర్‌ హెచ్చరికలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయిందని చెప్పక తప్పదు.

ఆర్టీసీ కార్మికులను ఏదోవిధంగా బయటకు వెళ్ళగొట్టి, సిఎం కేసీఆర్‌ తన పార్టీ నేతలకు, స్నేహితులు, సన్నిహితులకు ఆర్టీసీ సర్వీసులను కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారని, ఆ తరువాత మెల్లగా ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని పెద్ద కుట్ర పన్నుతున్నారన్న ఆర్టీసీ కార్మికుల వాదనలను సిఎం కేసీఆర్‌ ఈ హెచ్చరికలతో స్వయంగా దృవీకరించినట్లయింది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే దురుదేశ్యంతోనే సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపకుండా, సమ్మె కొనసాగేలా చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. రేపు హైకోర్టులో కూడా వారు ఇదే వాదన వినిపిస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.  

యూనియన్లు ప్రభుత్వాన్ని ‘బ్లాక్ మెయిల్’ చేస్తున్నాయని, దానిని సహించబోనని సిఎం కేసీఆర్‌ వాదిస్తున్నారు. కానీ ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్లు విధిస్తూ సిఎం కేసీఆరే తమను భయపట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారు. ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా బేషరతుగా విధులలో చేరుతామని, మళ్ళీ ఎన్నడూ యూనియన్లలో చేరబోమని ఆర్టీసీ కార్మికుల దగ్గర నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకోవడం కూడా తమను ‘బ్లాక్ మెయిల్’ చేయడమేనని ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారిప్పుడు. 

సిఎం కేసీఆర్‌ బెదిరింపులకు, డెడ్‌లైన్లకు ఆర్టీసీ కార్మికులు ఎవరూ భయపడరని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము కానీ హైకోర్టును కూడా ఖాతరు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. సిఎం కేసీఆర్‌ హెచ్చరికల తరువాత 10-15 మంది కార్మికులు విధులలో చేరినప్పటికీ మిగిలినవారందరూ డిపోల ముందు ధర్నాలు చేస్తూ తమ డిమాండ్లు నెరవేరేవరకు ఎట్టి పరిస్థితులలో విధులలో చేరబోమని ప్రతిజ్ఞలు చేశారు. 

సిఎం కేసీఆర్‌ తాజా హెచ్చరికలు, తాజా డెడ్‌లైన్‌ ప్రకటన తరువాత ఆర్టీసీలో యూనియన్లు సోమవారం హైదరాబాద్‌లో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకొని సమ్మెను కొనసాగించాలని నిర్ణయించడంతో ఆర్టీసీ కార్మికులు ఇంకా సంఘటితంగానే ఉన్నట్లు స్పష్టం అయ్యింది. కనుక ఈ ప్రతిష్టంభన ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో..ఎప్పుడు ముగింపు వస్తుందో చూడాలి.


Related Post