మౌనంగా ఉన్నా...నోరు విప్పినా సమస్యే!

November 04, 2019


img

తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి కుదిపివేస్తున్న ఆర్టీసీ సమస్యపై రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, తెరాస ముఖ్య నేతలు ఎవరూ కూడా ధైర్యం చేసి ఒక్క ముక్క మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం, ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడినా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సమ్మె మొదలైన కొత్తలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావువంటి వారు ఆర్టీసీ కార్మికులను హెచ్చరిస్తున్నట్లు మాట్లాడారు. దాంతో వారిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఈ సమస్యపై ప్రభుత్వంలో...పార్టీలో ఎవరూ కూడా ఒక్క ముక్క కూడా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఏ సమస్యపైనైనా అనర్గళంగా, చాలా ధైర్యంగా మాట్లాడే మంత్రులుగా పేరొందిన కేటీఆర్‌, హరీష్‌రావులు సైతం ఆర్టీసీ సమ్మె విషయంలో మౌనం వహించడం విశేషం. 

రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు మాట్లాడకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో 49,800 మంది ఆర్టీసీ కార్మికులు గత 31 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం ఒక్కరు కూడా ధైర్యం చేసి మాట్లాడలేకపోతున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మేము తెలంగాణ ప్రజలం కామా? మేము వేసిన ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. మరి మా సమస్యలపై ఎవరూ ఎందుకు మాట్లాడరు?” అని ప్రశ్నిస్తున్నారు. కానీ దానికీ మౌనమే సమాధానం అవుతోంది. 

తాజాగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్టీసీ సమ్మె గురించి చాలా పొదుపుగా మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి ఎటువంటి కోపమూ లేదు. వారిని తప్పు దోవ పట్టిస్తున్న యూనియన్ల మీదే ఆగ్రహంగా ఉంది. సిఎం కేసీఆర్‌ సూచన ప్రకారం ఆర్టీసీ కార్మికులు అందరూ తక్షణమే సమ్మె విరమించి విధులలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సమ్మె విరమించి విధులలో చేరితే ప్రభుత్వమే వారి బాగోగులు చూసుకొంటుంది,” అని అన్నారు.


Related Post