ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషికి హైకోర్టు నోటీసులు

November 04, 2019


img

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న తప్పుడు లెక్కలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి ధర్మాసనం, దీనిపై సంజాయిషీ ఇచ్చేందుకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎమ్‌డీ సునీల్‌శర్మ నలుగురికి నోటీసులు పంపించింది. ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ సమ్మె, బకాయిల కేసులపై జరిగే విచారణకు వారు నలుగురూ పూర్తి వివరాలతో హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఆర్టీసీ బకాయిలపై ఆర్ధిక శాఖ రవాణాశాఖ మంత్రికి ఇచ్చిన నివేదికకు, ఇన్‌చార్జి ఎమ్‌డీ సునీల్‌శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు చాలా తేడా కనిపిస్తోందని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టుకు తప్పుడు లెక్కలతో అఫిడవిట్ సమర్పించినట్లు భావిస్తున్నామని, దీనిపై నలుగురు ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరయ్యి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఈ కేసుపై హైకోర్టు ఇంత తీవ్రంగా స్పందిస్తూ ఉన్నతాధికారులను హైకోర్టుకు పిలిపించుకొని చివాట్లు పెడుతుంటే, సిఎం కేసీఆర్‌ మాత్రం హైకోర్టు తమ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదని, అసలు హైకోర్టులో ఇటువంటిదేమీ జరుగడమే లేదని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అయితే ఆర్టీసీ సమస్యను హైకోర్టు పరిష్కారిస్తుందో లేదో తెలియదు కానీ సిఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరితో ఆర్టీసీ కార్మికులు తామంతట తామే బేషరతుగా లొంగిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. కేసీఆర్‌ తాజా హెచ్చరికలతో ఆర్టీసీ యూనియన్ల మద్య కూడా చీలికలు వస్తున్నాయి. కనుక ఈ కేసులపై హైకోర్టు తుది తీర్పు చెప్పేలోపుగానే ఆర్టీసీ కధ ముగిసినా ఆశ్చర్యం లేదు.


Related Post