మోత్కుపల్లి మొదలెట్టేశారు

November 04, 2019


img

టిడిపి మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈనెల 9న హైదరాబాద్‌లో బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకోబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిల్లీలో చెప్పారు. అదేపని మీద ఈరోజు డిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వచ్చిన మోత్కుపల్లి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎన్నో పదవులు పొందాను కనుక పదవులు ఆశించి నేను బిజెపిలో చేరడం లేదు.  తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకొన్న రాష్ట్రంలో నియంతృత్వపాలన సాగిస్తున్న సిఎం కేసీఆర్‌ను గద్దె దింపడం కోసమే బిజెపిలో చేరాలని నిశ్చయించుకొన్నాను. ఇవాళ్ళ కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు నేను రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఆయనకు వివరించి తక్షణం రాజకీయ మార్పు అవసరమని నొక్కి చెప్పాను.

ఆనాడు సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ నిజాం నవాబు నియంతపాలనను అంతమొందించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించారు. మళ్ళీ ఇప్పుడు నియంతృత్వపాలన చేస్తున్న కేసీఆర్‌ నుంచి కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు విముక్తి, స్వేచ్చ కల్పిస్తారని నమ్ముతున్నాను. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు నేను కూడా గట్టిగా కృషి చేస్తాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడగొట్టి రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాను,” అని అన్నారు. 


Related Post