కేటీఆర్‌ ఈజ్ గ్రేట్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

November 01, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దపడినప్పటికీ ఇంతవరకు చేరలేదు. కానీ బిజెపిలో చేరే ఆలోచనతో రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలపై, పార్టీ అధిష్టానంపై కూడా తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన దృష్టి తెరాస మీద పడినట్లుంది. అందుకే ఈరోజు ఆయన సిఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను ప్రశంశలతో ముంచెత్తారు. 

ఈరోజు ఉదయం రాష్ట్ర ఐ‌టి,పరిశ్రమల శాఖల మంత్రి దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ వంటి సమర్దుడు ఐ‌టి,పరిశ్రమల శాఖల మంత్రిగా ఉండటం మన అదృష్టం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటు చేసినందుకు మునుగోడు ప్రజల తరపున కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. రాష్ట్రంలో శరవేగంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న మంత్రి కేటీఆర్‌కు మరొక్కసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సిఎం కేసీఆర్‌ వల్లనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తునందున ప్రజలు తెరాస వైపు ఉన్నారు,” అని అన్నారు.   

రాజగోపాల్ రెడ్డి తొలుత బిజెపిలో చేరేందుకు సిద్దపడినప్పటికీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ఇష్టపడకపోవడంతో రాజగోపాల్ రెడ్డికి బ్రేకులు పడినట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపిని, మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పొగుడుతుంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. బహుశః ఇదే కారణం చేత రాజగోపాల్ రెడ్డికి బిజెపిలో ప్రవేశం లభించకపోయుండవచ్చు. కనుక ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తెరాసలో చేరాలనుకొన్నా మళ్ళీ ఇదే సమస్య రావచ్చు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేసీఆర్‌ను, ఆయన పాలనను విమర్శిస్తుంటే, రాజగోపాల్ రెడ్డికి తెరాసకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకొంటే ముందుగా అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా పార్టీ మారేందుకు ఒప్పించుకోకతప్పదు లేకుంటే ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం బెటర్!


Related Post